IPL 2025: నేటి నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు షురూ.. తొలి సమరం బెంగళూరు వర్పెస్ కోల్‌కతా

IPL 2025 First Match KKR vs RCB at Eden gardens Stadium: క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన ఐపీఎల్ క్రికెట్ లీగ్ సీజన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ ఐపీఎల్ మెగా టోర్నీ 18వ సీజన్ మార్చి 22 నుంచి మే 25వరకు అలరించనుంది. మొత్తం ఈ టోర్నీలో 10 జట్లు బరిలోకి దిగుతుండగా.. తొలి మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్స్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య రాత్రి 7.30 నిమిషాలకు మ్యాచ్ జరగనుంది.
కాగా, ఈ 18వ సీజన్ ఐపీఎల్ వేడుకల ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్ హీరోలతో పాటు ప్రముఖులు హాజరై అలరించనున్నారు. ఇందు కోసం బీసీసీఐ ప్రత్యేక చొరవ తీసుకొని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ ఏర్పాట్లు చేసింది. ఈ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతాతో పాటు ముంభై ఇండియన్స్, హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ ఫెవరేట్‌గా నిలవనుండగా.. 17 ఐపీఎల్ సీజన్‌లో టైటిల్ సాధించని బెంగళూరు, పంజాబ్, ఢిల్లీ జట్లు కూడా టైటిల్ సాధించే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాయి.
ఇదిలా ఉండగా, ఇవాళ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్‌కు వర్షం అంతరాయం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. స్టేడియం పరిసర ప్రాంతాల్లో నిన్న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడడంతో కవర్ల సహాయంతో మైదానంలో కప్పారు. దీంతో ప్రాక్టీస్ మ్యాచ్‌కు సైతం అంతరాయం ఏర్పడింది. మరో రెండు రోజులు వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని కోల్‌కతా వాతావరణ కేంద్రం హెచ్చరించింది.