IPL 2025: నెరవేరిన బెంగళూరు కల.. ఐపీఎల్ ట్రోఫీ ముద్దాడినవేళ
RCB: ఐపీఎల్ ట్రోఫీ కోసం 18 ఏళ్లుగా నిరీక్షిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎదురుచూపులకు ఫలితం దక్కింది. రెండు నెలలుగా ఎంతో ఉత్సహాంగా సాగిన ఐపీఎల్- 18 సీజన్ నిన్నటితో అంతే ఘనంగా ముగిసింది. ఎన్నో ఏళ్లుగా టైటిల్ గెలుచుకోవాలన్న ఆర్సీబీ చివరకు టైటిల్ కలను నెరవేర్చుకుంది. ఈ సాలా కప్ నమ్దే అని హంగామా చేస్తూ బరిలోకి దిగిన బెంగళూరు ఆ మాటను నిజం చేసుకుంది. సీజన్ మొత్తం తన ప్రదర్శనతో ఆకట్టుకున్న పంజాబ్ మాత్రం ఫైనల్లో పోరాడి ఓడిపోయింది.
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బెంగళూరు ఇన్నింగ్స్ పడుతూ లేస్తూ సాగింది. ఓ వైపు పరుగులు వస్తున్నా.. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. దీంతో బెంగళూరు భారీ చేసే దిశగా కనిపించలేదు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఫిల్ సాల్ట్ ఔటయ్యాడు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన మయాంక్ రెండు బౌండరీలు, ఓ సిక్సర్ కొట్టి ఫామ్ లో కనిపించినా చాహల్ అతణ్ని వెనక్కి పంపాడు. కెప్టెన్ రజత్ పటిదార్ కూడా పదో ఓవర్లో వెంటనే ఔటయ్యాడు. వరుసగా వికెట్లు పడుతున్న మరో వైపు విరాట్ కోహ్లీ మాత్రం ఆచితూచి ఆడాడు. చివరకు 15 ఓవర్ లో అజ్మతుల్లా వేసిన ఐదో బంతికి క్యాచ్ ఇచ్చి కోహ్లీ కూడా ఔటయ్యాడు. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన జితేశ్ జోరుగా ఆడాడు. అలాగే జెమీసన్ కూడా సహకారం అందిచాడు. కానీ వీరు కూడా వెంటవెంటనే ఔటయ్యారు. షెపర్డ్ క్రీజులో ఉన్నా ధాటిగా ఆడలేక పోయాడు. చివర్లో పంజాబ్ బౌలర్ అర్ష దీప్ సింగ్ విజృంభించి 3 వికెట్లు రాబట్టాడు.
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్ తో హోరాహోరీగా జరిగిన ఫైనల్ పోరులో బెంగళూరు 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆసాంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చింది. కాగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఆనంతరం 191 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన పంజాబ్ 7 వికెట్లు కోల్పోయి చివరకు 184 పరుగులకే పరిమితమైంది. దీంతో టైటిల్ గెలుచుకోవాలన్న ఆశలు వదులుకుంది.
పంజాబ్ బ్యాటర్లలో శశాంక్ సింగ్, జోస్ ఇంగ్లిస్ పోరాడినా ఫలితం లేకపోయింది. ఛేదనలో పంజాప్ కింగ్స్ ఇన్నింగ్స్ ఒడిదొడుకుల మధ్య సాగింది. కానీ ప్రారంభంలో ధీటుగా ఆడిన పంజాబ్ మొదటి వికెట్ కు 5 ఓవర్లలో 43 పరుగులు సాధించారు. పవర్ ప్లే అనంతరం పంజాబ్ పరుగులు సాధించడం కష్టంగా మారింది. ఇక ఐదో ఓవర్లలో రెండు ఫోర్లు కొట్టి జోరు మీదున్న ప్రియాన్ష్.. ఆఖరి బంతికి ఔటయ్యాడు. ఇక పంజాబ్ జట్టు ఎంతో ఆశలు పెట్టుకున్న కెప్టెన్ అయ్యర్ (1) ఘోరంగా విఫలమయ్యాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. జోరుగా ఆడుతున్న ఇంగ్లిస్ ను 13 ఓవర్లో కృనాల్ ఔట్ చేయడంతో ఇక పంజాబ్ పరుగులు రాబట్టేందుకు చాలా కష్టాలు పడింది. ఆరు ఓవర్లలో పంజాబ్ విజయానికి 85 పరుగులు అవసరం కాగా.. చివర్లో బ్యాటింగ్ వచ్చిన శశాంక్ సింగ్ మెరుపులు మెరిపించాడు. కానీ లక్ష్యం పెద్దగా ఉండటంతో 184 పరుగులు వద్దే పంజాబ్ ఆగిపోయింది.