IPL 2025: తుది అంకానికి ఐపీఎల్.. సా. 6 గంటలకే సెలబ్రేషన్స్
Finals: ఐపీఎల్ 2025 సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఇవాళ పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఫైనల్ పోరు జరగనుంది. అందులో భాగంగానే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ముగింపు వేడుకలు ఇవాళ సాయంత్రం 6 గంటలకే ప్రారంభం కానున్నాయి. ఆపరేషన్ సిందూర్ విజయం సేపథ్యంలో ఇండియన్ ఆర్మీకి కృతజ్ఞతలు తెలుపుతూ బీసీసీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబోతోంది. కాగా ముగింపు వేడుకల్లో ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్, ఆయన కుమారులు శివం, సిద్దార్థ్ మహదేవన్ పాల్గొంటారని తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్ లో సేవలందించిన భారత త్రివిధ దళాల ప్రతినిధులను ఈ సందర్భంగా బీసీసీఐ సత్కరించనుంది. అలాగే పహల్గామ్ ఉగ్రదాడిలో చనపోయిన పర్యాటకులు, పాకిస్తాన్ దాడుల్లో వీరమరణం పొందిన సైనికులకు ఘనంగా నివాళులు అర్పించనున్నారు.
ఇక ఐపీఎల్ ఫైనల్ లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. అయితే బెంగళూరు ఇదివరకు నాలుగు పర్యాయాలు ఫైనల్ కి చేరినా.. ట్రోఫీని మాత్రం అందుకోలేక పోయింది. మరోవైపు పంజాబ్ జట్టు కూడా రెండు సార్లు ఫైనల్ కు చేరింది. ఇరు జట్లు ఇప్పటివరకు టైటిల్ అందుకోకపోవడంతో గెలుపు కోసం ఉవ్విళ్లూరుతున్నాయి. ఏ జట్టు గెలిచినా రికార్డ్ అవుతోంది. అయితే తమ జట్టే ట్రోఫినీ గెలుస్తుందని ఏ జట్టు ఫ్యాన్స్ ఆ జట్టుకు మద్దతు తెలుపుతున్నారు.