Special Panel: పైరసీపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కమిటీ

TG Government On Piracy: ప్రస్తుత రోజుల్లో పైరసీ చాలా పెరిగిపోయింది. మూవీ విడుదలైన గంటల్లోనే హెడీ ప్రింట్స్ పైరసీ సైట్లలో కనిపిస్తున్నాయి. కాగా సినిమాల పైరసీని నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. పైరసీపై కఠిన చర్యలు తీసుకునేందుకు కార్యచరణ సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో టీఎఫ్డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజ్ పైరసీని అరికట్టేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు టీఎఫ్డీసీ ఎండీ సీహెచ్ ప్రియాంకతో కలిసి సమావేశం నిర్వహించారు. నోడల్ ఏజెన్సీగా, సినిమా వాణిజ్య మండలికి చెందిన సైబర్ సెల్, పోలీసుశాఖ ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు నిర్మాత దిల్ రాజు తెలిపారు.
పైరసీ భూతాన్ని అరికట్టేందుకు.. అవసరమైతే మరికొన్ని కొత్త నిబంధనలను తీసుకొస్తామని చెప్పారు. సినీ ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తామని టీఎఫ్డీసీ ఎండీ ప్రియాంక అన్నారు. కొన్ని సంవత్సరాలుగా ప్రొడ్యూసర్స్, ఫిల్మ్ ఛాంబర్, పలువురు చేసిన కృషితో పైరసీ తగ్గింది. కానీ ఈ ఏడాది జనవరి నుంచి పైరసీ బాగా పెరిగిపోయిందని సినీ వర్గాలు అంటున్నాయి.