Nithiin: నితిన్ గ్రాఫ్ దారుణంగా పడిపోవడానికి కారణాలు ఇవే.. ?

Nithiin: స్టార్ హీరోలు అయినా కుర్ర హీరోలు అయినా వారి మార్కెట్ ను బట్టే కలక్షన్స్ ఉంటాయి. ఈ మధ్యకాలంలో కుర్ర హీరోల గ్రాఫ్ కొద్దికొద్దిగా తగ్గుతూ వస్తుంది. ముఖ్యంగా హీరో నితిన్ గ్రాఫ్ చూస్తే మరీ దారుణం అని చెప్పాలి. జయం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన నితిన్ మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని స్టార్ గా మారాడు. ఆ తరువాత విజయాపజయాలను లెక్కచేయకుండా వరుస సినిమాలు చేస్తూనే వచ్చాడు.
అసలు కొన్ని సినిమాలు అయితే నితిన్ ఎందుకు తీశాడో కూడా తెలియకుండా అయిపోయింది. ఆటాడిస్తా, ద్రోణ, విక్టరీ, హీరో, రెచ్చిపో.. ఇలా ఏ సినిమా ముట్టుకున్నా అది డిజాస్టర్ గా నిలిచింది. ఆ సమయంలో నితిన్ కెరీర్ ముగిసిపోయిందని కూడా వార్తలు వచ్చాయి. ఇక 2012.. నితిన్ ఇష్క్ సినిమాతో పునర్జన్మ ఎత్తాడు. నితిన్ కెరీర్ గురించి చెప్పాలంటే ఇష్క్ ముందు ఆ తరువాత అని చెప్పుకోవచ్చు.
ఇష్క్ సినిమా రూ. 40 కోట్ల గ్రాస్.. రూ. 22. 6 కోట్లు షేర్ ను రాబట్టి మంచి హిట్ గా నిలిచింది. ఆ తరువాత నితిన్ కెరీర్ లో మంచి మంచి సినిమాలను ఎంచుకుంటాడని అనుకున్నారు. ఇష్క్ తరువాత గుండెజారి గల్లంతయ్యిందే హిట్. ఈ సినిమా రూ. 20 కోట్ల గ్రాస్.. రూ. 10. 5 కోట్ల షేర్ ను రాబట్టి హిట్ గా నిలిచింది. అలా ఒక్కో సినిమాకు తన మార్కెట్ ను పెంచుకుంటూ పెంచుకుంటూ పోయి అఆ సినిమాతో హయ్యెస్ట్ షేర్ రాబట్టాడు.
త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత జంటగా నటించిన ఈ సినిమా 2016లో రిలీజ్ అయ్యి రూ.75కోట్ల గ్రాస్.. రూ. 47. 48 కోట్ల షేర్ ను రాబట్టింది. నితిన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత నితిన్ రేంజ్ పెరిగింది. అభిమానులు కూడా పెరిగారు. అయితే అదే నితిన్ చివరి హిట్.
అఆ తరువాత భీష్మ వచ్చింది కానీ.. అన్ని కలక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయింది. సినిమా హిట్ అయినా కేవలం రూ. 52 కోట్ల ను సాధించింది. ఇక ఈ సినిమా తరువాత వచ్చిన చెక్, రంగ్ దే, మ్యాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలు రావడం.. వచ్చినదారే పోవడం జరిగాయి. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ కేవలం రూ. 10 కోట్లు మాత్రమే రాబట్టింది.
ఎందుకు నితిన్ గ్రాఫ్ 75 కోట్ల నుంచి కేవలం 10 కోట్లకు పడిపోయింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే చర్చ నడుస్తోంది. అసలు నితిన్ గ్రాఫ్ పడిపోవడానికి కారణాలు ఏంటి ఆరాలు తీయడం మొదలుపెట్టారు. మొదటి కారణం.. నితిన్ కథల ఎంపిక సరిగ్గా లేదని అంటున్నారు. జనరేషన్ మారేకొద్దీ కొత్త కొత్త కథలు వస్తున్నాయి. కానీ, నితిన్ మాత్రం కథ, కథనాలు బలం లేనివి ఎంచుకుంటున్నాడు. ఉదాహరణకు భీష్మ తీసుకుంటే.. అదొక రొమాంటిక్ కామెడీ డ్రామా కాబట్టి.. కొద్దోగొప్పో ప్రేక్షకులను మెప్పించింది.
భీష్మ సినిమా తరువాత వచ్చిన చెక్, రంగ్ దే, మ్యాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాల్లో బలహీనమైన కథ ఉండడంతోనే అవి ప్లాప్ అయ్యాయి. ఇకే ఇప్పుడు రాబిన్ హుడ్ తో నితిన్ వస్తున్నాడు ఈ సినిమా ఎలాఉంటుంది అనేది చూడాలి. ఇక ఈ కారణం కాకుండా ఇంకొకటి ఏంటంటే.. ఇన్నేళ్ళలో నితిన్ తన మార్కెట్ ను విస్తరించలేకపోయాడు.
అన్ని రొటీన్ సినిమాలు చేయడం, ఎక్కువగా రొమాంటిక్ హీరో లేదా మాస్ హీరోగా కనిపించాడు, కానీ స్టార్ హీరోల స్థాయికి చేరుకోవడానికి కావాల్సిన వైవిధ్యమైన కథలను కానీ, స్టార్ డైరెక్టర్స్ ను కానీ నితిన్ అందిపుచ్చుకోలేకపోయాడు. ఇక ఇప్పుడు నితిన్ ఆశలన్నీ రాబిన్ హుడ్ మీదనే పెట్టుకున్నాడు. భీష్మ కాంబో కావడంతో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.
సోషల్ మీడియా టాక్ ప్రకారం రాబిన్ హుడ్ టార్గెట్ రూ. 30 కోట్లు. ఇది అందుకోవడం కూడా నితిన్ కి కత్తిమీద సామే. ఎందుకంటే నితిన్ మార్కెట్ గురించి అందరికీ తెల్సిందే. చివరి సినిమా కేవలం 10 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఆ మార్కెట్ తో రాబిన్ హుడ్ రూ. 30 కోట్లు వసూలు చేయడం అంటే పెద్ద పని. కానీ, నితిన్ కచ్చితంగా ఆ టార్గెట్ ను రీచ్ అవ్వాలి. అప్పుడే అతను హిట్ అందుకోగలడు. మరి నితిన్ రాబిన్ హుడ్ తో తన గ్రాఫ్ ను మళ్లీ పెంచుకుంటాడా.. ? లేదా అనేది తెలియాలంటే మార్చి 28 వరకు ఎదురుచూడాల్సిందే.