Last Updated:

Manmohan singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత

Manmohan singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత

Former Prime Minister Manmohan Singh passes away: భారత మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్(92) కన్నుమూశారు. గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయనను ఎమర్జెన్సీ వార్డులో వెంటిలేటర్‌పై ఉంచి వైద్యులు చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో ఆయన చికిత్స పొందుతూ రాత్రి 10గంటల సమయంలో తుది శ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు.

కాగా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. 1932 సెప్టెంబర్ 26న ప్రస్తుతం పాకిస్తాన్‌లోని పంజాబ్ చక్వాల్‌లో అతి సాధారణ కుటుంబలో జన్మించాడు. ఆయనకు భార్య గురుశరణ్ కౌర్, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతిపై రాష్ట్రపతి ద్రైపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులు సంతాపం ప్రకటించారు.

మన్మోహన్ సింగ్… 2004 నుంచి 2014 వరకు దేశ ప్రధానిగా పనిచేశారు. ఈ సమయంలో కీలకమైన ఆర్థిక సంస్కరణలకు పెద్దపీట వేశారు. ప్రధానిగా నెహ్రూ, ఇందిరాగాంధీ, నరేంద్ర మోదీ తర్వాత అత్యధిక కాలం దేశ ప్రధానిగా ఆయన కొనసాగారు. అంతకుముందు మన్మోహన్ సింగ్ దాదాపు 33 ఏళ్ల పాటు పార్లమెంట్ సభ్యుడిగా సైతం కొనసాగారు. 1991లో రాజ్యసభలో అడుగుపెట్టిన మన్మోహన్ సింగ్.. ఆనాడు ప్రధానిగా పీవీ నరసింహారావు ఉన్న సమయంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అలాగే ఆర్థిక శాఖలో సలహాదారుగా, కార్యదర్శిగా, ఆర్బీఐ గవర్నర్‌గా కూడా పనిచేశారు.

అయితే, 1991లో దుర్బర ఆర్థిక పరిస్థితుల నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి మన్మోహన్ సింగ్‌ను రాజ్యసభకు పంపి ఆర్థిక మంత్రిగా చేశారు. లిబరలైజేషన్, ప్రివలైజేషన్, గ్లోబలైజేషన్ పాలసీతో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఘనత మన్మోహన్‌కే దక్కింది. దీంతో పాటు ప్రభుత్వ సంస్థలు, బ్యాంకుల ప్రైవేటీకరణ ద్వారా నాటి సంస్కరణలు ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచాయి. 1991 నుంచి 1996 వరకు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన హయాంలోనే అత్యధిక డీజీపీ 10.2శాతం వృద్ధి రేటు నమోదవ్వగా.. వెనుకబడిన వర్గాలకు 27 శాతం సీట్ల కేటాయింపు జరిగింది.