Last Updated:

Manmohan Singh: ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్.. దేశ రూపురేఖలను మార్చింది ఇవే!

Manmohan Singh: ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్.. దేశ రూపురేఖలను మార్చింది ఇవే!

Manmohan Singh’s Economic reforms decisions that shaped a billion lives: భారతదేశ మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మన్మోహన్ సింగ్(92) కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ డిసెంబర్ 26న గురువారం రాత్రి కన్నుమూశారు. మన్మోహన్ సింగ్.. 2004 నుంచి 2014 వరకు భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేశారు. అంతకుముందు ఆర్థికమంత్రిగా పనిచేశారు.

భారతదేశ ప్రధానిగా ఎక్కువకాలం చేసిన ప్రధానమంత్రుల్లో ఆయన ఒకరుగా నిలిచారు. మన్మోహన్ సింగ్‌ను భారత దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా కొనియాడుతారు. ఆయన 1932 సెప్టెంబర్ 26న పంజాబ్ ప్రావిన్స్‌లో జన్మించారు. అప్పట్లో ఈ ప్రాంతానికి నీటి వసతితోపాటు విద్యుత్ ఉండేది కాదు. పంజాబ్‌ యూనివర్సిటీలో విద్య పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత కేంబ్రిడ్జి యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్న ఆయన.. ఆక్స్‌ఫర్డ్‌లో డాక్టరేట్ తీసుకున్నారు. అయితే కేంబ్రిడ్జ్‌లో చదువుకుంటున్న సమయంలో డబ్బులు లేక ఇబ్బంది పడ్డారని మన్మోహన్ సింగ్ కుమార్తె దమన్ సింగ్ తన పుస్తకంలో ప్రస్తావించారు.

1991లో మన్మోహన్ సింగ్ కేంద్ర ఆర్థిక మంత్రిగా అయిన తర్వాత రాజకీయంగా ప్రతిష్ట పెరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థ దివాళా దశలో ఉన్న సమయంలో ఆయన ఆ పదవి చేపట్టారు. అయితే సివిల్ సర్వెంట్‌గా ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుడిగా పనిచేశారు. రిజర్వ్ బ్యాంకుకు గవర్నర్‌గా కూడా పనిచేశారు. అలా దేశంలో ఆర్థిక సంస్కరణల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

1999లో లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోవడంతో కాంగ్రెస్ ఆయనను మరోసారి రాజ్యసభకు నామినేట్ చేసింది. 2004లో కూడా ఆయన రాజ్యసభకు ఎంపికయ్యారు. సోనియాగాంధీ ఇటలీ మూలాలను ప్రశ్నిస్తూ ఆమెపై ప్రత్యర్థులు ప్రశ్నించడంతో మన్మోహన్ సింగ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.

మన్మోహన్ సింగ్.. మేధావిగా తన వ్యక్తికత్వం, తెలివితేటలతో అంతర్జాతీయంగా ప్రతిష్ట సంపాదించుకున్నారు. ఆయన మాటలు తక్కువ.. పని ఎక్కువ అనే రీతిలో ప్రశాంతమైన ప్రవర్తనతో ఎంతోమంది అభిమానులను సంపాదించి పెట్టింది. మరోవైపు, బలహీనుడని మన్మోహన్ సింగ్‌ను ప్రతిపక్షాలు విమర్శలు చేసేవారు. అలాగే లోక్‌సభలో ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఇతర పార్టీలకు చెందిన ఎంపీలను కొనుగోలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. అలాగే బొగ్గుగనుల కేటాయింపులో లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందనే ఆరోపణలపై ఆయన తన మౌనాన్ని సమర్థించుకున్నారు. వేల సమాధానాల కంటే అదే ఉత్తమమైందని చెప్పారు. అయితే, 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా ఉన్న సమయంలో పలు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. ఈ సంస్కరణలు దేశ రూపురేఖలను మార్చాయి.

ఆర్థిక సరళీకరణ(1991): ఆర్థికశాఖ మంత్రిగా మన్మోహన్ సింగ్ పనిచేశారు. ఈ సమయంలో దేశ ఆర్థికవ్యవస్థను సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ(ఎల్‌పీజీ) దిశలో గాడిలో పెట్టడంలో మన్మోహన్ పాత్ర ఎనలేనిది.ఎగుమతి, దిగుమతిల విషయంలో సంస్కరించారు. అలాగే విదేశీ పెట్టుబడులకు సైతం ప్రోత్సాహం అందించారు. దీంతో దేశంలో ఉపాధి అవకాశాలు మరింత పెరిగాయి. ఇందులో భాగంగానే దేశ ప్రజల ఆదాయం పెరిగింది. మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో దేశ ఆర్థిక వృద్ధి రేటు ఎక్కువగా నమోదైంది. కాగా, 2004 నుంచి 2008 మధ్య దేశ జీడీపీ వృద్ధి రేటు 8శాతం కంటే ఎక్కువగా ఉంది.

గ్రామీణ ఉపాధిహామీ పథకం(2005): 2004లో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలానికే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2005లో గాంధీజీ పేరిట మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(ఎంజీఎన్ఆర్ఈజీఏ)ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇదే పథకం కింద గ్రామాల్లో, పట్టణాల్లో చాలా మంది ఉపాధి పొందుతున్నారు. అంతేకాకుండా దేశంలో కరువు, నిరుద్యోగంను నివారించింది.

అలాగే 2005లో పారదర్శకత, జవాబుదారీతనానికి సమాచార హక్కు చట్టం, 2008లో భారత్, అమెరికా మధ్య అణు ఒప్పందం, 2009లో ఆధార్ పథకం తీసుకొచ్చింది. దేశంలో ప్రతి పౌరుడికి ప్రత్యేక గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో ఈ ఆధార్ పథకాన్ని తీసుకొచ్చారు. దీంతో పాటు 2009లో విద్యా హక్కు తీసుకొచ్చారు. దీంతో పాటు మహిళా రిజర్వేషన్, సాధికారత సాధించేలా మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది.