Last Updated:

NDA Meeting: అభివృద్ధే ఏజెండా.. ఎన్డీయే కూటమి నేతల సమావేశంలో చర్చించిన కీలక అంశాలివే!

NDA Meeting: అభివృద్ధే ఏజెండా.. ఎన్డీయే కూటమి నేతల సమావేశంలో చర్చించిన కీలక అంశాలివే!

NDA meeting at BJP President JP Nadda’s residence in New Delhi: ఎన్డీఏ కూటమి పార్టీల నేతల సమావేశం ఢిల్లీలోని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో బుధవారం జరిగింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరుగగా, నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక ఎన్డీఏ నేతలు మూడోసారి భేటీ అయ్యారు.

ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ..
మరికొద్ది నెలల్లో ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో గెలుపు వ్యూహాలు, ఇటీవల ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల పరిణామాలపై భేటీలో చర్చించినట్లుగా సమాచారం. సమావేశంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు, కుమారస్వామి, జితిన్ రామ్ మాంఝీ, లలన్ సింగ్, భుపేంద్ర యాదవ్, రామ్మోహన్ నాయుడు, ప్రతాప్ రావ్ జాదవ్, అనుప్రియా పాటిల్, అరుణ్ సింగ్, రంగ్ గోరా, తుషార్ వెల్లపల్లి, వినయ్ కోరే, సంజయ్ నిషాద్, జాన్ పాండియన్, ఉపేంద్ర కుష్వా తదితర నేతలు హాజరయ్యారు.

సుహృద్భావ వాతావరణంలో సమావేశం..
సమావేశం అనంతరం న్యూఢిల్లీలో టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు విలేకరులతో మాట్లాడారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు పలు సూచనలు, సలహాలపై సమావేశంలో చర్చించామన్నారు. సమావేశం సుహృద్భావ వాతావరణంలో చక్కగా సాగిందన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాలతోపాటు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జరిగిన చర్చపై భేటీలో చర్చించినట్లు ఆయన వివరించారు. భవిష్యత్‌లో ఎన్డీఏ కూటమి నేతలు ఏ విధంగా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలనే అంశంపై చర్చించామన్నారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల పలు సూచనలు, సలహాలపై చర్చించామన్నారు.

అభివృద్ధి అంశాలపై చర్చ
ఎంపీల నియోజకవర్గంలో అభివృద్ధి అంశాలపై సైతం చర్చ జరిగిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలనే అంశాలపై సైతం చర్చించామన్నారు. వన్ నేషన్ – వన్ ఎలక్షన్‌తోపాటు వక్ఫ్ బోర్డుపై చర్చ జరగలేదని తెలిపారు.

కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ..
ఎన్డీయే నేతల సమావేశ అనంతరం కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అమిత్ షాతో ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ సైతం.. సీఎం చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కేంద్ర మంత్రులతో జరిగిన ఈ చర్చల్లో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను వారి దృష్టికి సీఎం తీసుకెళ్లి చర్చించినట్లు తెలుస్తోంది. రాజధాని అమరావతి ప్రాంతాభివృద్ధితోపాటు రైల్వే లైన్లు తదితర అంశాలను వారిలో చర్చించినట్లు సమాచారం.