Last Updated:

Janasena : ఫించన్ల తొలగింపును నిరసిస్తూ వైకాపాపై ఫైర్ అయిన పవన్ కళ్యాణ్… ప్రెస్ నోట్ రిలీజ్ !

Janasena : ఫించన్ల తొలగింపును నిరసిస్తూ వైకాపాపై ఫైర్ అయిన పవన్ కళ్యాణ్… ప్రెస్ నోట్ రిలీజ్ !

Janasena : సామాజిక పింఛన్ల తొలగింపు నిమిత్తం నోటీసులు జారీ చేస్తున్న వైకాపా తీరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యతిరేకించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రెస్ నోట్ ని రిలీజ్ చేశారు. ఈ మేరకు ఆ ప్రెస్ నోట్ లో… రాష్ట్రంలో సామాజిక పింఛన్ల పరిధిలోకి వచ్చే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ప్రతి నెలా ఇచ్చే పించన్లను తగ్గించుకొనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కసరత్తు పేదలను ఇబ్బందుల పాలుజేసే విధంగా ఉంది. పింఛన్లు ఎందుకు తొలగించకూడదో చెప్పాలంటూ సుమారుగా 4 లక్షల మంది లబ్ధిదారులకి నోటీసులు జారీ చేశారు. పేదలైన వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులను ఇప్పటి వరకూ పొందుతున్న పింఛన్లకు దూరం చేయడం కోసమే నోటీసులు ఇచ్చారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అని పేర్కొన్నారు.

లబ్ధిని తొలగించేందుకు చూపించిన కారణాలు కూడా సహేతుకంగా లేవు. మచ్చుకు కొన్ని మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలో కొందరు వృద్దులకు పింఛన్లు రద్దు నోటీసులు ఇచ్చి ఒక్కొక్కరి పేరునా వేల ఎకరాల భూములు ఉన్నాయని కారణం చూపారు. అదే నిజమైతే ఆ వృద్ధులకు ఆ భూములకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పించవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అదే విధంగా పెనుకొండ ప్రాంతంలో రజక వృత్తిపై ఆధారపడిన శ్రీమతి రామక్క అనే పింఛనుదారుకి 158 ఇళ్ళు ఉన్నాయని నోటీసులో చూపారు. నిజంగా అన్ని ఇళ్ళు రామక్క గారికి ఉంటే అవి ఎక్కడ ఉన్నాయో చూపించి ఆ ఇళ్ల తాళాలు ఇవ్వండి. మెళియాపుట్టి ప్రాంత వృద్ధులైనా, రజక వృత్తి చేసుకొనే రామక్క గారైనా పేదలే. వారికి తండ్రి నుంచో, తాతల నుంచో వారసత్వంగా వచ్చిన ఎస్టేట్లు, ఇళ్ళు లేవని గ్రహించగలరు. మీ ప్రభుత్వ రికార్డుల ప్రకారం అంతటి ఆస్తిపరులే అయితే పింఛన్లు కోసం కార్యాలయాల చుట్టూనో, మీ వాలంటీర్ల చుట్టూనే ఎందుకు తిరుగుతారు? అని ప్రశ్నించారు.

విద్యుత్ బిల్లు పెరిగిందనో, ఇంటి విస్తీర్ణం ఎక్కువైందనే రద్దు చేయాలని చూడటం విచిత్రంగా ఉంది. కొన్ని ఇళ్లకు ఉమ్మడి మీటర్లు ఉంటున్నాయి… అలాగే ఒకే ఇంటి నెంబర్ తో మూడు నాలుగు వాటాలు ఉంటాయి. కాబట్టి వాస్తవిక దృక్పథంతో చూసి పేద వృద్ధులను, వితంతువులను ఆవేదనకు గురి చేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ విధంగా నోటీసులు ఇవ్వడాన్ని మీరు సమర్ధిస్తున్నారు. పాతికేళ్ళ కిందట చనిపోయినవారు ఇప్పటికీ ఆదాయపు పన్ను కడుతున్నారు అని నోటీసుల్లో చూపించి వితంతు పింఛన్లు రద్దు చేస్తామంటున్నారు. ఈ తరహా నోటీసులు సమర్ధనీయమేనా? ఈ తరహా నోటీసులు దివ్యాంగులకు సైతం వేదన కలిగిస్తున్నాయి. పదిపదిహేనేళ్ళకు ముందు నుంచీ పింఛన్ తీసుకొంటున్న దివ్యాంగులను, నాడు ఇచ్చిన ధ్రువపత్రాలు ఇప్పుడు చూపించాలని ఒత్తిడి చేయడంలో ఉద్దేశం ఏమిటి? వారి పైకల్యం కళ్లెదురుగా కనిపిస్తున్నా లబ్దికి దూరం చేస్తామనడం భావ్యమేనా? అని ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి: