Waqf Act in Bengal: పశ్చిమబెంగాల్‌లో మళ్లీ చెలరేగిన హింస.. 110 మంది అరెస్టు!

Protest against Waqf Act in Bengal: ఇటీవల లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం లభిచింది. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతుననాయి. తాజాగా చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో మళ్లీ నిరసనలు చేలరేగాయి. శనివారం మాల్డా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. నిరసనకారులను ఆపడానికి ప్రయత్నించిన భద్రతా సిబ్బందిపై రాళ్లతో దాడులు చేశారు. దీంతో హింసాత్మక పరిస్థితి నెలకొంది. 110 మందికి పైగా నిరసనకారులను అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఉద్రిక్తంగా పరిస్థితి..
పశ్చిమబెంగాల్‌లో ప్రస్తుతం పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే ముర్షిదాబాద్ జిల్లాలో పలు నిషేధాజ్ఞలు విధించామని, ఇంటర్నెట్ సేవలు నిలిపివేశామని తెలిపారు. శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్న వదంతులను ఎవరూ పట్టించుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆందోళనకారులపై జరిపిన కాల్పుల్లో గాయపడిన 10మంది పోలీసులు, ఓ యువకుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
అమల్లోకి వక్ఫ్ చట్టం..
వక్ఫ్ సవరణ చట్టం మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. కేంద్ర మైనార్టీ వ్యవహారాలశాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్‌లో వక్ఫ్ సవరణ చట్టాన్ని అమలుచేయబోమని సీఎం మమతా ఇటీవల ప్రకటించారు. మైనార్టీలు, వారి ఆస్తులను రక్షిస్తానని హామీనిచ్చారు. ఒకప్పుడు బంగ్లా, పాక్, భారత్ కలిసి ఉండేవని, తర్వాత విభజన జరిగిందని గుర్తుచేశారు. ఇక్కడ ఉండిపోయిన మైనార్టీలకు రక్షణ కల్పించడం మన బాధ్యత అని, తాను ఉన్నంతకాలం వారిని, వారి ఆస్తులను రక్షిస్తానని సీఎం అన్నారు.
మమత ప్రభుత్వం విఫలం : బీజేపీ
పరిస్థితిని అదుపు చేయడంలో మమత సర్కారు పూర్తిగా విఫలమయ్యిందని బీజేపీ విమర్శలు గుప్పించింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అవసరం అయితే కేంద్రం సహాయం తీసుకోవాలని సూచించింది. ఇది నిరసన చర్యగా కనిపించట్లేదని, సమాజంలోని ఇతర వర్గాల్లో గందరగోళాన్ని వ్యాప్తి చేయడానికి దుష్టశక్తులు చేస్తున్న ప్రయత్నాలని బీజేపీ మండిపడింది.