Union Budget: విపక్షాలు వాకౌట్… లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి
Nirmala Sitharaman reaches Parliament to present 8th consecutive Budget: 2025-26 కేంద్ర బడ్జెట్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు పార్లమెంట్ భవనంలో జరిగిన సమావేశంలో క్యాబినెట్ పద్దకు ఆమోదముద్ర వేసింది. అనంతరం ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. వరుసగా నిర్మలా సీతారామన్ 8వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టగా.. ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. కాగా, అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్మను నిర్మలా సీతారామన్ కలిసి బడ్జెట్ ప్రతిని అందజేశారు. ఈ బడ్జెట్ పద్దుపై పేద, మధ్య తరగతి కుటుంబాల్లో ఆసక్తి నెలకొంది. మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనపై చర్చించేందుకు విపక్షాలు ప్రయత్నించాయి. చర్చ కోరుతూ నిరసన తెలిపాయి. అనంతరం సభ నుంచి కొంతమంది వాకౌట్ చేశారు. దీంతో విపక్షాల నిరసనల మధ్యే బడ్జెట్ ప్రసంగం సాగింది.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని ‘దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్..’ అన్న గురజాడ సూక్తిని ప్రస్తావించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వృద్ధి మందగించినా భారత్ మెరుగైన పనితీరు సాధించిందన్నారు. పేదలు, యువత, రైతులు, మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యంలో ఈ బడ్జెట్ రూపకల్పన చేసినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ మేరకు ప్రధానమంత్రి ధన్ ధాన్య యోజన కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి ప్రకటించారు. దేశంలో వెనుకబడిన జిల్లాలో వ్యవసాయానికి ప్రోత్సాహం అందించామన్నారు. గోదాములు, నీటిపారుదల, రుణ సౌకర్యాలు కల్పించామన్నారు. దాదాపు 1.7 కోట్ల గ్రామీణ రైతులకు లబ్ధి జరిగించాన్నారు.
అలాగే కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి పెంచారు. ఈ మేరకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారు. దీంతో 7.7కోట్ల మంది రైతులకు ప్రయోజనం జరగనుంది. ఎంఎస్ఎంఈలకు వచ్చే ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. అలాగే ఎంఎస్ఎంఈలకు ఇచ్చే రుణాలను రూ.5 కోట్ల నుంచి రూ.10కోట్లకు పెంచారు. ఇందులో స్టార్టప్‌లకు రూ.10కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలను పెంచినట్లు వివరించారు. అలాగే బీహార్‌లో పప్పు ధాన్యాల ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకం తీసుకొస్తున్నారు. ఈ మేరకు బీహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటు కానుంది. దీంతో కంది, మినుములు, మసూర్‌లను కేంద్రం కొనుగోలు చేయనుంది. అలాగే పండ్లు, కూరగాయల ఉత్పత్తికి కొత్త పథకం తీసుకురానున్నారు. కాగా, గత పదేళ్లలో సాధించిన అభివృద్ధే స్ఫూర్తి అని నిర్మలా సీతారామన్ తెలిపారు. త్వరిత, సమ్మిళిత అభివృద్ధి పెట్టుబడుల సాధన లక్ష్యంగా బడ్జెట్ తీసుకొచ్చామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వృద్ధి మందగించినా భారత్ మెరుగైన పనితీరు సాధించిందన్నారు.
గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా ప్రకటించారు. ఇందులో భాగంగానే గిగ్ వర్కర్లకు గుర్తింపు కార్డులు మంజూరు చేయనున్నారు. ఈ శ్రమ్ పోర్టల్ కింద నమోదు చేసుకునేలా సీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కల్పించనున్నట్లు వివరించారు. దీంతో దాదాపు కోటి మంది గిగ్ వర్కర్లకు ప్రయోజనం కలుగనుందని నిర్మలా సీతారామన్ తెలిపారు.
అలాగే రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్లు కోట్ల రుణాలు ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. మెడికల్ చదువుల కోసం రానున్న ఐదేళ్లలో మెడికల్ సీట్లను మరో 75వేలు పెంచుతామని తెలిపారు. 2025-26 లో 200 క్యాన్సర్ సెంటర్లను నెలకొల్పుతామన్నారు. దేశ వ్యాప్తంగా 5 స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లను ప్రారంభిస్తామన్నారు. దీంతో పాటు రూ.500 కోట్లతో విద్యలో ఏఐ ఎక్సలెన్సీ సెంటర్ ప్రవేశపెడతామన్నారు.
మరిన్ని విషయాలు.
– జల్ జీవన్ మిషన్‌కు మరిన్ని నిధులు కేటాయిస్తామని తెలిపారు. ఈ పథకం కింద 15 కోట్ల మందికి రక్షిత మంచినీరు అందిస్తామన్నారు.
– రూ.30వేల పరిమితితో పట్టణ పేదల కోసం యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులు మంజూరు చేస్తామన్నారు.
– ఆర్థిక రంగానికి మూడో ఇంజిన్‌గా పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. క్లీన్ టెక్ మిషన్ కింద సోలార్, ఈవీ, బ్యాటరీ పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. ఈ పరిశ్రమల ప్రోత్సాహం కోసం నేషనల్ మానుఫ్యాక్చరింగ్ మిషన్ తీసుకొస్తున్నామని తెలిపారు.
– కొత్త ఉడాన్ పథకంను మరో 120 రూట్లో అమలు చేయనున్నట్లు తెలిపారు. 10 ఏళ్లలో 4 కోట్ల మందికి విమాన ప్రయాణం కల్పించడమే లక్ష్యమన్నారు. బీహార్‌లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు ఏర్పాటకు నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
– బీమా రంగంలో వంద శాతం ఎఫ్డీఐ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న 74 శాతం నుంచి వందశాతానికి పెంచారు.
– వచ్చే వారం కొత్త ఇన్‌కమ్ టాక్స్ బిల్లు ప్రవేశపెట్టనున్నారు.
– విద్యుత్ రంగంలో సంస్కరణలు
– నగరాల అభివృద్ధి కోసం అర్బన్ చాలెంజ్ ఫండ్
– మధ్య తరగతి ప్రజల కోసం 40వేల ఇళ్లు
– ఉపాధి కల్పన దిశగా పర్యాటక రంగం
– దేశంలోని 50 ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ప్రత్యేక అభివృద్ధి
– యువత కోసం నైపుణ్య శిక్షణ కోసం ప్రత్యేక కేంద్రాలు
– పర్యాటక ప్రదేశాలకు మెరుగైన రవాణా సదుపాయాలు
– కొన్ని రకాల విదేశీ పర్యాటకులకు వీసా మినహాయింపు