Published On:

Telangana High Court : భూదాన్ భూముల వ్యవహారం.. హైకోర్టును ఆశ్రయించిన ముగ్గురు ఐపీఎస్‌లు

Telangana High Court : భూదాన్ భూముల వ్యవహారం.. హైకోర్టును ఆశ్రయించిన ముగ్గురు ఐపీఎస్‌లు

Telangana High Court : భూదాన్‌ భూములకు సంబంధించిన వ్యవహారంపై పలువురు ఐపీఎస్‌ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై ఈ నెల 24న న్యాయస్థానం విచారణ చేపట్టింది. మొత్తం 27 మంది అధికారులకు సంబంధించిన భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని ఆదేశించింది. జస్టిస్‌ భాస్కర్‌రెడ్డి సింగిల్ బెంచ్‌ ధర్మాసనం తీర్పు వెలువరించింది. తీర్పును సవాల్‌ చేస్తూ మంగళవారం కొందరు ఐపీఎస్‌ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టును ఆశ్రయించిన వారిలో మహేశ్‌భగవత్‌, స్వాతి లక్రా, సౌమ్యా మిశ్రా ఉన్నారు.

 

ఉన్నతాధికారులకు ఫిర్యాదు..
భూదాన్‌ భూముల్లో అక్రమాలపై విచారణ చేపట్టాలని ప్రభుత్వంలోని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా చర్యలు తీసుకోలేదు. సీబీఐ, ఈడీలతో దర్యాప్తు చేయించాలని కోరుతూ మహేశ్వరం మండలానికి చెందిన బిర్ల మల్లేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలుపై జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి ఈ నెల 24వ తేదీన విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు విన్న ధర్మాసనం.. రికార్డులను పరిశీలించాలని కోరారు. నాగారంలోని 181, 182, 194, 195 సర్వేల్లోని భూములు భూదాన్‌ బోర్డుకు చెందినవిగా తేలుతాయని స్పష్టం చేశారు. పిటిషన్‌లో ఉన్నతాధికారులపై తీవ్ర ఆరోపణలు చేసిన క్రమంలో వారి ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగానికి అవకాశం ఉందని పేర్కొన్నారు.

 

హైకోర్టు తన విచక్షణాధికారంతో సామాజిక ఆస్తి పరిరక్షణలో భాగంగా పిటిషన్‌పై విచారణ ముగిసే వరకూ సర్వే నంబర్లలోని భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని ఆదేశాలు జారీచేశారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకూ భూదాన్ భూముల్లో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయరాదని, అన్యాక్రాంతం చేయడానికి వీలు లేదని ప్రతివాదులను ఆదేశించారు. ఈ క్రమంలోనే పలువురు ఐపీఎస్‌లు హైకోర్టును ఆశ్రయించారు.

 

 

ఇవి కూడా చదవండి: