Last Updated:

Revanth Reddy: భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద భావోద్వేగానికి గురైన రేవంత్ రెడ్డి

కేసీఆర్‌, కేటీఆర్‌ అవినీతిని బట్టబయలు చేస్తే.. నన్ను చర్లపల్లి జైల్లో పెట్టారు. కరుడుగట్టిన తీవ్రవాదులను ఉంచే గదిలో ఉంచారు

Revanth Reddy: భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద భావోద్వేగానికి గురైన రేవంత్ రెడ్డి

Revanth Reddy: చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి.. అందుకు అనుగుణంగానే కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఈటెల పై ఆయన మండి పడ్డారు. మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ. 25 కోట్లు ఇచ్చారంటూ ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించడాన్ని రేవంత్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రమాణం చేశారు.

 

రాజీ నా రక్తంలో లేదు: రేవంత్ రెడ్డి(Revanth Reddy)

రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి కేసీఆర్‌తో లాలూచీ పడటం నా రక్తంలోనే లేదు. చివరి శ్వాస విడిచే వరకు కేసీఆర్‌తో రాజీ పడే ప్రసక్తే లేదు. ఒక వేళ మునుగోడు ఉప ఎన్నికలో కేసీఆర్‌ నుంచి ఒక్క రూపాయి తీసుకున్నా.. నా కుటుంబం మొత్తం సర్వనాశనమైపోతుంది. మునుగోడు ఉపఎన్నిక పరిణామాలు అందరికీ తెలుసు. బీఆర్ఎస్, బీజేపీలు భారీగా డబ్బులతో బరిలోకి దిగాయని, కానీ కాంగ్రెస్‌ మాత్రం నిజాయితీగా పని చేసే అభ్యర్థి పాల్వాయి స్రవంతిని పోటీలో నిలిపింది. మునుగోడు ఉపఎన్నిక కోసం ఆ రెండు పార్టీలు భారీగా డబ్బులు ఖర్చు చేశాయి. మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్‌ అమ్ముడు పోయిందని ఈటల ఆరోపించారు. కేసీఆర్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీ, పాల్వాయి స్రవంతి రూ. 25 కోట్లు తీసుకున్నారని విమర్శించారు. నా నిజాయితీని అనుమానిస్తే మంచిది కాదు. నా కళ్లలో నీరు రప్పించావు. కేసీఆర్‌ సర్వమంతా దారబోసినా రేవంత్‌ రెడ్డిని కొనలేరు. రాజీ నా రక్తంలో లేదు. భయం నా ఒంట్లో లేదు’ అని రేవంత్‌ రెడ్డి అన్నారు.

 

Image

కేసీఆర్‌ ముసుగులో ఈటెల రాజకీయం

కేసీఆర్‌, కేటీఆర్‌ అవినీతిని బట్టబయలు చేస్తే.. నన్ను చర్లపల్లి జైల్లో పెట్టారు. కరుడుగట్టిన తీవ్రవాదులను ఉంచే గదిలో ఉంచారు. జైల్లో పెట్టి నా మనో ధైర్యాన్ని దెబ్బతీయాలని చూశారు. నోటీసులు ఇవ్వగానే లొంగిపోలేదు ఈ రేవంత్‌రెడ్డి. రాజేంద్రా.. నువ్వు చేరిన పార్టీలో గుర్తింపు కోసం దిగజారుడు ఆరోపణలు చేస్తావా? ఈటల ఆరోపణలు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నష్టం. కేసీఆర్‌ దగ్గర 25 కోట్లు తీసుకుంటే ఆయన కళ్లలోకి చూసే ధైర్యం ఉండేదా? ఇన్నాళ్లూ మీ పై సానుభూతి ఉండేది. కేసీఆర్‌కి వ్యతిరేకంగా కొట్లాడటమంటే ఇదేనా? 9 ఏళ్లు నిద్రలేని రాత్రులు గడిపా.. నా జీవితం నాకు వడ్డించిన విస్తరి.. కేసీఆర్‌ను ఓడించడమే నా లక్ష్యం. అందుకోసం సర్వం పోయినా ఫర్వాలేదు. కేసీఆర్‌ ముసుగు వేసుకొని ఈటల రాజకీయాలు చేస్తున్నారు.

 

ఈటెలవి దిగజారుడు మాటలు

ఈటెల చేసిన ఆరోపఱలు చౌకబారుగా ఉండొచ్చు.. కానీ, అది నా మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయి. నేను అమ్ముడుపోయి ఉంటే.. ప్రజల గుండెల్లో ఉండేవాడిని కాదు. ఈటలకు కన్నీళ్ల విలువ తెలియదు. మానవత్వం లేదు. ఎవరు గద్దెనెక్కుతారో.. ఎవరు గద్దె దిగుతారో కాలమే నిర్ణయం తీసుకుంటుంది. అమ్మవారిని నమ్ముతాను కాబట్టే ప్రమాణం చేశాను. దేవుడిపై విశ్వాసం ఉంటే ఈటల తన మాటలను వెనక్కి తీసుకోవాలి. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం ఈటల దిగజారి మాట్లాడుతున్నారు. నేను విసిరిన సవాల్‌ మేరకు చార్మినార్‌ వద్దనున్న భాగ్యలక్ష్మి దేవాలయంలో ప్రమాణం చేశాను. ఈటల కూడా తన ఆరోపణలను నిరూపించుకోవాలి.’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.