Last Updated:

MLC Kavitha: కవితకు మద్దతుగా పోస్టర్లు.. రెయిడ్స్‌ కు ముందు.. తర్వాత!

MLC Kavitha: దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఈడీ కార్యాలయం ఎదుట నిరసనలు జరుగవచ్చన్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఈడీ కార్యాలయం వద్ద మీడియాకు అనుమతిని నిరాకరించారు.

MLC Kavitha: కవితకు మద్దతుగా పోస్టర్లు.. రెయిడ్స్‌ కు ముందు.. తర్వాత!

MLC Kavitha: దిల్లీ లిక్కర్ స్కామ్ దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతుండగా ఇప్పటివరకు 11 మందిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ బిజినెస్ మెన్ అరుణ్ రామచంద్ర పిళ్ళై ని ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.  ఈ స్కామ్‌ లో కవితకు సంబంధించిన కీలక వివరాలు పిళ్లై వెల్లడించాడని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈడీ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది.

 

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఈడీ కార్యాలయం ఎదుట నిరసనలు జరుగవచ్చన్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఈడీ కార్యాలయం వద్ద మీడియాకు అనుమతిని నిరాకరించారు. ఇప్పటికే ఈడీ కార్యాలయంలోనే మనీశ్ సిసోడియా, అరుణ్ పిళ్లై ఉన్నారు. రూ.100 కోట్ల ముడుపుల్లో కవిత పాత్రపై ఈడీ విచారణ కొనసాగుతోంది. మనీశ్ సిసోడియా కస్టడీ పిటిషన్ లో కవిత పేరును ప్రస్తావించిన ఈడీ మనీలాండరింగ్ చట్టం సెక్షన్ 50, 54 కింద ప్రశ్నించనుంది. మనీశ్ సిసోడియా, అరుణ్ పిళ్లై, కవితను కలిపి ఈడీ విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కవిత కోసం దిల్లీకి కేటీఆర్.. (MLC Kavitha)

కవితకు ఈడీ నోటీసులపై సీఎం కేసీఆర్‌ స్పందించారు. కవితను అక్రమంగా కేసులో ఇరికిస్తున్నారని కేసీఆర్‌ అన్నారు. విచారణ పేరుతో కవితను అరెస్ట్‌ చేసి ఇబ్బంది పెట్టొచ్చు. చేసుకుంటే చేసుకోనీ అందర్నీ వేధిస్తున్నారు. కేసులకు భయపడేది లేదు. న్యాయపోరాటం చేద్దాం, రాబోయే ఎన్నికల్లో బీజేపీని లేకుండా చేద్దాం అంటూ పార్టీ నాయకులతో కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. అదే విధంగా నిన్న పార్టీ విస్తృత స్థాయి మీటింగ్ ముగియగానే కేటీఆర్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

కవితకు మద్దతుగా పోస్టర్లు..

ఈడీ విచారణ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితకు మద్దతుగా హైదరాబాద్ లో పోస్టర్లు వెలిశాయి. రెయిడ్స్‌ కి ముందు తర్వాత అంటూ పోస్టర్లను అతికించారు. ఎమ్మెల్సీ కవిత ఎలాంటి మరక అంటకుండా ఉన్నారంటూ అర్థం వచ్చేలా వీటిని రూపొందించారు. ప్రస్తుతం ఇవి అందరిని ఆకర్షిస్తున్నాయి. భాజపాలో చేరకముందు.. చేరిన తర్వాత అంటూ పలువురు భాజపా నేతల ఫొటోలతో నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు కనపడుతున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు నేతలు సీబీఐ, ఈడీ రెయిడ్స్ జరగగానే.. కాషాయరంగు పూసుకొని భాజపాలో చేరిపోయారంటూ ఫ్లెక్సీలతో విమర్శలు కురుస్తున్నాయి. ప్రస్తుత కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, పశ్చిమ బెంగాల్ భాజపా ముఖ్యనేత సువేందు అధికారి, ఏపీకి చెందిన భాజపా నేత సుజనా చౌదరి, కేంద్ర మంత్రి నారాయణ్ రాణెతో పోలుస్తూ.. రెయిడ్స్‌కి ముందు తర్వాత ఎమ్మెల్సీ కవిత ఎలాంటి మరక అంటకుండా ఉన్నారంటూ అర్థం వచ్చేలా ఫ్లెక్సీలు, పోస్టర్లు నగరంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

 


మోదీని విమర్శిస్తూ కూడా హైదరాబాద్ లో పోస్టర్లు సైతం దర్శనమిచ్చాయి. ప్రధాని మోదీని రావణాసురుడితో పోలుస్తూ.. సీబీఐ, ఈడీ, ఐటీ, ఈసీ వంటి సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ ఈ పోస్టర్లను రూపొందించారు.