Published On:

Sridhar Babu : అభివృద్ధిని అడ్డుకోవాలన్నదే బీఆర్ఎస్‌ కుట్ర.. మంత్రి శ్రీధర్ బాబు హాట్ కామెంట్స్

Sridhar Babu : అభివృద్ధిని అడ్డుకోవాలన్నదే బీఆర్ఎస్‌ కుట్ర.. మంత్రి శ్రీధర్ బాబు హాట్ కామెంట్స్

IT Minister Sridhar Babu : అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ దుష్ప్రచారాలు చేస్తున్నాయని, ప్రజలను పక్కదారి పట్టించేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోందని వ్యాఖ్యానించారు. కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై ఇవాళ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌ ప్రజలకు మంచి జీవనం అందించాలని ప్రభుత్వం భావించిందన్నారు. మూసీ పరివాహాక ప్రజలకు స్వచ్ఛమైన గాలి, మంచి వాతావరణం ఇవ్వాలని భావించామన్నారు. హైదరాబాద్‌లో మంచి జీవనంతోపాటు యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలని పూనుకున్నట్లు తెలిపారు.

 

ఫ్యూచర్ సిటీని నిర్మించాలని సంకల్పించాం..
నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఫ్యూచర్ సిటీని నిర్మించాలని సంకల్పించినట్లు చెప్పారు. కంచ గచ్చిబౌలి 400 ఎకరాల భూమిని ప్రభుత్వం కాపాడిందని తెలిపారు. ఆ భూములు ప్రభుత్వానివే అని సుప్రీం తీర్పు ఇచ్చిందని స్పష్టం చేశారు. సుప్రీం చెప్పినప్పటికీ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏఐ వీడియోలు సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో ఫేక్ వీడియోలు వైరల్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సెంట్రల్ యూనివర్సిటీ భూములు, పరిసరాల్లో ఏనుగులు ఉన్నాయా? అంటూ విద్యార్థులను ప్రభావితం చేసిన ప్రభుత్వ పనులను అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. హైదరాబాద్‌కు పెట్టబడులు, ఉద్యోగాలు రావొద్దని కుట్రచేస్తున్నారని మండిపడ్డారు.

 

ఎలాంటి వివాదాలు లేవు..
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఎలాంటి వివాదాలు లేవని స్పష్టం చేశారు. సెబీ నిబంధనలకు అనుగుణంగా బాండ్లు జారీ ప్రక్రియ జరిగిందని తెలిపారు. ఐసీఐసీఐ నుంచి తాము ఎలాంటి లోన్లు తీసుకోలేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే నిధులు సేకరిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం అతి తక్కువ వడ్డీకే నిధులు సేకరిస్తోందని తెలిపారు. 37 సంస్థలు బాండ్ల కొనుగోలు ద్వారా పెట్టుబడులు పెడుతున్నాయని వివరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు 11 శాతం వడ్డీకి రుణాలు తీసుకున్నదని చెప్పారు. గత ప్రభుత్వం కంటే తక్కువ వడ్డీకే రుణాలు తీసుకుంటున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిందని, రుణమాఫీ టీజీఐఐసీ ద్వారా నిధులు సేకరించి మాఫీ ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు.

 

బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణ చేయలేదా?
రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలా వద్దా అని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమాల కోసం భూసేకరణ చేస్తున్నామని, బీఆర్ఎస్ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తుందన్నారు. భూసేకరణ నిబంధనల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణ చేయలేదా? ఫార్మా సిటీ కోసం వేల ఎకరాల భూములను సేకరించలేదా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో కాలుష్యాన్ని తరిమికొట్టేందుకే మూసీ ప్రక్షాళన చేస్తుంటే డ్డుకోవాలని చూశారని, ఇప్పుడు కంచ గచ్చిబౌలి భూముల విషయంలో పర్యావరణ పరిరక్షణ అని అడ్డుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. అభివృద్ధిని అడ్డుకోవాలన్నదే ప్రతిపక్షాల లక్ష్యమన్నారు. ప్రజలను పక్కదారి పట్టించాలని బీఆర్ఎస్‌ ప్రయత్నిస్తోందని మంత్రి వ్యాఖ్యానించారు.

 

 

ఇవి కూడా చదవండి: