Harish Rao: పాలమూరు పేరును చెడగొడుతున్నాడు.. కేసీఆర్ కలుపు మొక్క కాదు కల్పవృక్షం
Ex Minister Harish Rao Comments about Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ బిడ్డనని చెప్పుకుంటూ పేరును చెడగొడుతున్నాడని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అబద్ధాల నోటికి మొక్కాలన్నారు. అబద్ధాలు ఆడడమే రేవంత్ రెడ్డి డీఎన్ఏ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కురుమూర్తి స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడారు. వరంగల్ సభలో తిట్ల పురాణం తప్ప ప్రజలు, మహిళలకు పనికొచ్చే మాట చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంపై పగ పెంచుకుని, ప్రజలకు దగా చేస్తున్నాడని మండిపడ్డాడు. కేసీఆర్ కలుపు మొక్క కాదని, కల్పవృక్షమన్నారు.
అడ్డదారులతో ముఖ్యమంత్రి పదవి..
సీనియర్ కాంగ్రెస్ నాయకులను తొక్కుకుంటా అడ్డదారులతో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని హరీశ్ రావు ఆరోపించారు. గెలిచిన తర్వాత పేదలు, రైతులను మోసం చేస్తున్నాడని మండిపడ్డాడు. రేవంత్ మాటల్లో శబ్దం ఎక్కువ విషయం తక్కువ అన్నారు. వరంగల్ లో 50సార్లు కేసీఆర్ పేరు జపం చేశాడని గుర్తుచేశారు. ప్రజలు కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటున్నారు. ఓటమి భయంతోనే కేసీఆర్‌పై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్‌కు రేవంత్ కు నక్కకు నాగలోకానికి ఉన్న వ్యత్యాసం ఉందన్నారు.
ముఖ్యమంత్రి.. కేసీఆర్ పెట్టిన భిక్ష
తెలంగాణకు నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు అంటే అది కేసీఆర్ పెట్టిన భిక్ష అన్నారు. పంద్రాగస్టు లోపల పూర్తి రుణమాఫీ చేసి ఉంటే నేను రాజీనామా చేసేవాడినని గుర్తుచేశారు. రూ. 4వేల కోట్లతో పాలమూరులో ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లు అందించిన ఘనత కేసీఆర్ దేనన్నారు. 30 లక్షల నుంచి కోటి 59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించే స్థాయికి తెలంగాణ చేరిందన్నారు. దంటే అది కేసీఆర్ కృషి అని పేర్కొన్నారు.