Published On:

Harish Rao : హెచ్‌సీయూ భూవివాదం.. రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీశ్‌రావు బహిరంగ లేఖ

Harish Rao : హెచ్‌సీయూ భూవివాదం.. రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీశ్‌రావు బహిరంగ లేఖ

Harish Rao : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూవివాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి నాయకత్వంలో చేస్తున్న పనుల గురించి తనకు చాలా ఆందోళనగా ఉందని, రాహుల్ చెప్పే సూత్రాలకు వారు విరుద్ధంగా పని చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. మీరు రాజ్యాంగాన్ని కాపాడాలని చెబుతారు.. కానీ తెలంగాణలో మీ పార్టీ సీఎం దాన్ని పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ 2024 ఎన్నికల హామీల్లో, పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా చేస్తామని రాహుల్ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. కానీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పది మంది ఎమ్మెల్యేలను రేవంత్ తమ పార్టీలోకి తీసుకున్నారని తెలిపారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సుప్రీంకోర్టు గురించి తప్పుడు వ్యాఖ్యలు చేయడంతో కోర్టు కూడా తప్పు పట్టిందని గుర్తు చేశారు.

 

 

రాహుల్ నోరు విప్పరా?
రాహుల్ గాంధీ బుల్డోజర్లతో ఇళ్లు కూల్చడాన్ని వ్యతిరేకిస్తారని, కానీ తెలంగాణలో పేదల ఇళ్లను హైడ్రా, మూసీ నది పేరుతో కూల్చేస్తున్నారని ఆరోపించారు. యూనివర్సిటీలో 100 ఎకరాల చెట్లను నాశనం చేశారని ఫైర్ అయ్యారు. ఎన్నో వన్యప్రాణులు, నెమళ్లు, ఇతర పక్షుల ఇళ్లు లేకుండా పోయాయని తెలిపారు. హెచ్‌సీయూలో విద్యార్థులు, ప్రొఫెసర్లపై పోలీసులు లాఠీచార్జి చేస్తే అందరూ తప్పు పడితే, కానీ మీ పార్టీ మాత్రమే మౌనంగా ఉందన్నారు. రోహిత్ వేముల మృతి తర్వాత యూనివర్సిటీకి వచ్చి విద్యార్థులకు అండగా ఉంటానని చెప్పారు. ఇప్పుడు పోలీసు దాడి జరిగినప్పుడు ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆపమని చెప్పే వరకు దాడులు ఆగలేదన్నారు. యూనివర్సిటీ విద్యార్థులు, తెలంగాణ ప్రజల తరఫున రాహుల్ ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని లేఖలో డిమాండ్ చేశారు.

 

 

అదానీ గ్రూప్‌ను ఆహ్వానిస్తారా?
మీరు అదానీ గ్రూప్‌ను వ్యతిరేకిస్తారని, కానీ ఇక్కడ మీ సీఎం తెలంగాణకు ఆహ్వానిస్తున్నారని మండిపడ్డారు. నల్గగొండలో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ కోసం గ్రామాల భూమిని బలవంతంగా తీసుకుంటున్నారని, లగచర్లలో ఆదివాసీ రైతులపై పోలీసులు దాడి చేశారని ఆరోపించారు. మీరు ఎందుకు పట్టించుకోలేదన్నారు. మీరు ప్రధాని మోదీని వ్యతిరేకిస్తారని, కానీ మీ సీఎం రేవంత్ ‘బడే భాయ్’ అంటున్నారని, ఈ పనులన్నీ మీ సమ్మతితో జరుగుతున్నాయా, లేక మీరు మౌనంగా ఉంటున్నారా? అని ప్రశ్నించారు. మీరు తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వాలని కోరారు. మీరు సమస్యలను సీరియస్‌గా తీసుకుని, మీ సీఎంకు సరైన దారి చూపాలని కోరుతున్నట్లు హరీశ్‌రావు తన లేఖలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: