Last Updated:

Gaddar : మూగబోయిన ప్రజా యుద్ధ నౌక.. గద్దర్ మృతి

ప్రజా గాయకుడు గద్దర్ తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని అపోలో స్పెక్ట్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గద్దర్.. ఇటీవల గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. అయితే రెండు రోజుల క్రితం ఆయనకు ఆపరేషన్ సక్సెస్ అయ్యింది.

Gaddar : మూగబోయిన ప్రజా యుద్ధ నౌక.. గద్దర్ మృతి

Gaddar : ప్రజా గాయకుడు గద్దర్ తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని అపోలో స్పెక్ట్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గద్దర్.. ఇటీవల గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. అయితే రెండు రోజుల క్రితం ఆయనకు ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. కానీ ఊహించని రీతిలో రెండు రోజుల క్రితం మళ్ళీ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ఈరోజు ఉదయం బీపీ పెరగడంతో పాటు షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పడిపోవడంతో చికిత్స అందించారు. అయితే మధ్యాహ్నం మల్టిపుల్ ఆర్గాన్స్ దెబ్బతినడంతో గద్దర్ కన్నుమూసినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఆయన మృతి వార్తతో తెలుగు రాష్ట్రాలలో తీవ్ర విషాదం నెలకొంది.

గద్దర్ (Gaddar) అసలు పేరు గుమ్మడి విఠల్‌రావు. ఆయన మెదక్ జిల్లా లోని తూప్రాన్ గ్రామంలో లచ్చమ్మ, శేషయ్యలకు 1949లో జన్మించారు. గద్దర్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సూర్యుడు, చంద్రుడు (2003లో అనారోగ్యంతో చనిపోయారు), వెన్నెల ఉన్నారు. ఆయన నిజమాబాద్, మహబూబ్‌నగర్‌లలో విద్యాభ్యాసం చేశారు. హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు. గద్దర్ ఒగ్గు కథ, బుర్ర కథల ద్వారా పల్లె ప్రజలను అలరించారు. ఇతర రాష్ట్రాల్లోనూ ప్రదర్శనలు ఇచ్చారు. దళితులు అనుభవిస్తున్న కష్టాల గురించీ తనదైన శైలిలో ప్రదర్శనలు ఇచ్చేవారు.

తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ప్రజల్లో చైతన్యం కల్పించడంలో గద్దర్ ఎంతో కీలకపాత్ర పోషించారు. తన పాటలతో ఉద్యమాలకు ఊపు తెచ్చిన ఘనత గద్దర్ దే. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా గద్దర్ తన పాటలతో.. ఉద్యమ స్పూర్తిని రగిలించారు.  1987లో కారంచేడులో దళితుల హత్యలపై గద్దర్ అవిశ్రాంత పోరాటం చేశారు. ఫేక్ ఎన్ కౌంటర్లపై గద్దర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 1990 ఫిబ్రవరి 18న జన నాట్య మండలి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో గద్దర్ నిర్వహించిన భారి బహిరంగ సభకు 2 లక్షల మంది ప్రజలు హాజరయ్యారంటే ఆయన క్రేజ్ ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు.

1997 ఏప్రిల్ లో గద్దర్ పై పోలీసులు కాల్పులు జరపడంతో ఆయన శరీరంలోకి బుల్లెట్లు గుచ్చుకున్నాయి. ఒక్కటి తప్ప అన్ని బుల్లెట్ లను తొలగించారు. అది తొలగిస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదమని కడుపులోనే బుల్లెట్ ను డాక్టర్లు వదిలేశారు. 2010లో తెలంగాణ ఉద్యమంలో చేరకముందు గద్దర్.. నక్సలైట్ గా ఉండేవారు. గద్దర్‌ ఈ ఏడాది జూన్ 21న కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. గద్దర్ ప్రజాపార్టీని స్థాపిస్తున్నట్లు చెప్పారు. ఆ పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఆయన ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కూడా కలిశారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నానని మీడియా సమావేశంలో ప్రకటించారు. కానీ ఊహించని రీతిలో ఇప్పుడు ఆయన మరణించడం అందరినీ శోకంలోకి నెట్టింది.