Last Updated:

Vijayarama Rao: మాజీ మంత్రి కె. విజయరామారావు కన్నుమూత

మాజీ మంత్రి కె. విజయరామారావు కన్నుమూసారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంగా ఉన్న విజయరామారావు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన చంద్రబాబు నాయుడు హయాంలో మంత్రిగా పనిచేసారు.

Vijayarama Rao: మాజీ మంత్రి కె. విజయరామారావు కన్నుమూత

Vijayarama Rao: మాజీ మంత్రి కె. విజయరామారావు కన్నుమూసారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంగా ఉన్న విజయరామారావు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన చంద్రబాబు నాయుడు హయాంలో మంత్రిగా పనిచేసారు.

మొదటిసారి గెలిచి మంత్రిగా ..(Vijayarama Rao)

1999 అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా అప్పటికే సీబీఐ డైరక్టర్ గా పనిచేసి రిటైరయిన విజయరామారావును చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే అభ్యర్దిగా ఎంపిక చేసారు. హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ సిగ్మెంట్లో కాంగ్రెస్ అభ్యర్ది పి. జనార్దన రెడ్డిని ఓడించిన విజయరామారావును చంద్రబాబు రోడ్లు భవనాల శాఖ మంత్రిగా నియమించారు. ప్రజాదీవెన కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు రాజకీయాలకు సంబంధం లేని పలువురు వ్యక్తులను నాడు అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దించారు. వారిలో విజయరామారావు ఒకరు. అయితే ఆయన 2004 ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజక వర్గంలో ఓడిపోయారు. తరువాత టీడీపీ పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న విషయం తెలిసిందే.

కేసీఆర్ పార్టీ పెట్టడానికి కారణం అదేనా..

సామాజిక వర్గాల సమీకరణాల్లో భాగంగా అప్పట్లో విజయరామారావుకు మంత్రిపదవి ఇచ్చినందువల్లనే కేసీఆర్ కు ఇవ్వలేకపోయినట్టు చంద్రబాబు నాయుడు తెలిపారు. అయితే దీనితో అసంతృప్తి చెందడం వలనే కేసీఆర్ టీడీపీ గుడ్ బై చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేయడం జరిగిందని చెబుతారు. మొత్తంమీద ఒక మంత్రి పదవి తెలంగాణ రాజకీయాల్లో పలు సంచనాలకు, మార్పులకు కేంద్ర బిందువుగా మారిందని నాటి నేతలు అంటారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ధ్యేయంగా ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రత్యేక తెలంగాణ సాధించింది. అంతేకాదు రాష్ట్రం ఏర్పడిన తరువాత వరుసగా జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం సాధించింది. ఆ విధంగా నాడు మంత్రి పదవి మిస్పయిన కేసీఆర్  తరువాత వరుసగా రెండు సార్లు సీఎం అయ్యారు.

వరంగల్ జిల్లాలోని ఏటూరు నాగారంలో జన్మించిన విజయరామారావు మద్రాసు యూనివర్శిటీలో బీఏ చదివి కరీంనగర్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేసారు. తరువాత సివిల్ సర్వీస్ కు సెలక్టయి చిత్తూరు ఏఏస్పీగా నియమితులయ్యారు. అంచెలంచెలుగా ఎదిగిన విజయరామారావు సీబీఐ డైరక్టర్ గా పదవీ విరమణ పొందారు. సీబీఐ లో తనపదవీ కాలంలో హవాలా కుంభకోణం, బాబ్రీ మసీదు విధ్వంసం, ఇస్నో గూఢచర్యం కేసులను దర్యాప్తు చేసారు. అయితే అదే సీబీఐ బ్యాంకు రుణాలను తీసుకుని మోసం చేసారంటూ ఆయన తనయుడు కళ్యాణరావు పై కేసు నమోదు చేయడం విశేషం.