Chicken: కోళ్లకు కొత్త వైరస్.. అంతుచిక్కని వింతవ్యాధి
![Chicken: కోళ్లకు కొత్త వైరస్.. అంతుచిక్కని వింతవ్యాధి](https://s3.ap-south-1.amazonaws.com/media.prime9news.com/wp-content/uploads/2025/02/new-virus-attack-for-chicks.jpg)
Big Shock For Chicken Lovers: మాంసాహారుల్లో ఎక్కువ మంది చికెన్ తినడాన్ని ఇష్టపడతారు. ఆదివారం వచ్చిందంటే చాలు… కోడి కూర ఉండాల్సిందే. అయితే, ఈ వార్త చికెన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. అందుకు కారణం పౌల్ట్రీ పరిశ్రమను అంతుచిక్కని వైరస్ వణికిస్తోంది. దీంతో ఎంతో ఆరోగ్యంగా ఉన్న కోళ్లు కూడా ఉన్నట్టుండి చనిపోతున్నాయి. దీంతో పౌల్ట్రీ రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
ఉభయగోదావరి, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో..
తెలుగు రాష్ట్రాల్లో ఉభయగోదావరి, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో కోళ్లు చనిపోతున్నాయి. ఒక్కో ఫారంలో రోజుకు దాదాపు 10 వేల కోళ్లు చనిపోతుండటం తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది. సాధారణంగా ఫారాల్లో రోజుకు 0.05 శాతం కోళ్లు అనారోగ్య కారణాల వల్ల చనిపోతుంటాయి. భారీస్థాయిలో కోళ్ల చనిపోతుండటంలో రైతులు గందరగోళానికి గురవుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 15 రోజుల్లో 40 లక్షల కోళ్లు మృతిచెందాయి.
భిన్నంగా వైరస్ లక్షణాలు..
ప్రతి ఏడాది డిసెంబర్, జనవరి నెలల్లో చలిగాలుల ప్రభావం ఉంటుంది. ఈ ధాటికి కోళ్లకు ఊపిరితిత్తుల సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఇప్పటి వైరస్ లక్షణాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. ఉదయం ఒక్క కోడికి వైరస్ సోకితే సాయంత్రానికి షెడ్డులో ఉన్న కోళ్లకు వైరస్ వ్యాపించి మృత్యువాత పడుతున్నాయి. దీంతో భయంతో రైతులు కోళ్లను అమ్మేయడానికి సిద్ధమవుతున్నారు.
తినటం మానేసిన జనం..
అంతుచిక్కని వైరస్ సోకి కోళ్లు చనిపోతున్నాయనే వార్తలు ప్రజలకు తెలియడంతో చాలా మంది చికెన్ తినడం మానేశారు. దీంతో చికెన్ రేట్లు భారీగా తగ్గాయని వ్యాపారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో కోళ్ల మరణాలకు కారణమైన వైరస్‌ను గుర్తించేందుకు అధికారులు రంగంలోకి దిగారు.
H15N వైరస్..!
తెలుగు రాష్ట్రాల్లో తెలియని వైరస్ కారణంగా కోళ్లు చనిపోతున్నాయి. మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదు. అధికారులు ఇది H15N వైరస్ అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. టీకాలు లేకపోవడం, సరైన నిర్వహణ లేకపోవడం వల్లే మరణాలు సంభవించి ఉండవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. గుడ్లు పెట్టిన నిమిషాల్లో కొన్ని కోళ్లు చనిపోయాయని రైతులు తెలిపారు. వైరస్ ఇతర కోళ్లలో వేగంగా వ్యాపించి, కోళ్ల పెంపకందారులకు పెద్ద నష్టాన్ని కలిగించింది.
పరీక్షా కేంద్రాలకు రక్త నమూనాలు..
సమాచారం అందుకున్న పశువైద్య శాఖ అధికారులు కోళ్ల ఫారాల్లో తనిఖీలు నిర్వహించారు. కోళ్ల నుంచి రక్త నమూనాలను సేకరించి విజయవాడ, భోపాల్‌లోని పరీక్షా కేంద్రాలకు పంపారు. 2012, 2020లో కూడా ఇదే తరహా వైరస్ వ్యాపించి, లక్షలాది కోళ్లు మరణించిన ఘటనలు చోటుచేసుకున్నాయి.