Red Sandal Wood: ఎర్రచందనం దుంగల పట్టివేత.. నలుగురు అరెస్ట్
Annamayya District: అన్నమయ్య జిల్లా తంబలపల్లి మండలం శేషాచలం అటవీ ప్రాంతంలో 48 ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా దుంగలను తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అలాగే ఓ బైక్ స్వాధీనం చేసుకున్నారు. కాగా ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారంతో ఇవాళ తెల్లవారుజామున టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు, టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్ ఆదేశాలతో డీఎస్పీ బాలిరెడ్డి, ఆర్ఐ చిరంజీవులుకు చెందిన ఆర్ఎస్ఐ మురళీధర్ రెడ్డి బృందం అటవీ ప్రాంతంలో తనిఖీలు చేశారు.
ఈమేరకు బురకాయల కోట అటవీ ప్రాంతంలో స్థానిక అటవీ శాఖ అధికారులు జయప్రసాదరావు, మోహన్ రెడ్డి, షబీన్ తాజ్ టాస్క్ ఫోర్స్ బృందానికి సాయం చేశారు. బురకాయల కోట ఫారెస్ట్ బీటు పరిధిలో డంపింగ్ పాయింట్ల వద్ద తనిఖీ చేశారు. అన్నగారిపల్లి సమీపంలోని వంకగట్టు దగ్గర ఓ బైకు, కొందరు వ్యక్తులు గుమికూడి ఉండటాన్ని అధికారులు గుర్తించారు. పోలీసులను చూసి కొందరు పారిపోయేందుకు ప్రయత్నించగా.. వారిని వెంబడించి నలుగురిని పట్టుకున్నారు. దీంతో ఆ ఏరియాలో తనిఖీలు చేసిన అటవీ, టాస్క్ ఫోర్స్ సిబ్బంది 48 ఎర్రచందనం దుంగలను గుర్తించారు. పోలీసులకు పట్టుబడిన వారంతా అన్నమయ్య జిల్లాకు చెందిన వారని అధికారులు చెప్పారు. అనంతరం ఎర్ర చందనం దుంగలు, బైకు, నలుగురు నిందితులను స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.