Heavy Flood: జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు భారీగా వరద

Heavy Flood In Krishna River: ఎగువన కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలతో జూరాల, శ్రీశైలం జలాశయాలకు భారీగా వరద కొనసాగుతోంది. మరోవైపు తుంగభద్ర ప్రాజెక్ట్ నుంచి కూడా కొన్ని రోజులుగా భారీగా వరద వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టుల్లో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. జారాల ప్రాజెక్ట్ కు 98 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. దిగువకు 1 లక్షా 3 వేల 414 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 318. 516 మీటర్లు కాగా.. ప్రస్తుతం 317.360 మీటర్లకు చేరింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ 9 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 7.389 టీఎంసీలు నీటినిల్వ ఉంది. దీంతో ప్రాజెక్ట్ 12 గేట్లను పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఇక బుధ, గురువారాల్లో శ్రీశైలం ప్రాజెక్ట్ కు 88,272 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటినిల్వ 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం రిజర్వాయర్ 115.78 టీఎంసీ నీటి నిల్వ ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 863.10 అడుగులకు చేరింది. మరోవైపు తుంగభద్ర ప్రాజెక్ట్ కు 30 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలకు కూడా వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. నారాయణపూర్ లో 30. 64 టీఎంసీలు, ఆల్మట్టిలో 80.97 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వరద ప్రవాహం మరికొద్ది రోజులు ఇలానే కొనసాగితే ప్రాజెక్ట్ లు పూర్తిస్థాయిలో నిండనున్నాయి.