Heavy Flood: జూరాల, శ్రీశైలం జలాశయాలకు భారీగా వరద!

Heavy Flood Flooting to Jurala: మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదికి భారీగా వరద పోటెత్తింది. దీంతో కృష్ణా బెసిన్ లో ఉన్న ప్రాజెక్టులకు భారీగా వరద వస్తోంది. ఈ నేపథ్యంలోనే జూరాల ప్రాజెక్ట్ కు భారీగా వరద ప్రవాహం పెరిగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు రాత్రి జూరాల ప్రాజెక్ట్ 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ లోకి ప్రస్తుతం 1 లక్షా 5 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. 1 లక్షా 3వేల 908 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుతం 317.380 మీటర్ల వద్ద నీటిమట్టం కొనసాగుతోంది.
ఇక ఎగువన జూరాల నుంచి వస్తున్న వరద ప్రవాహంతో శ్రీశైలం జలాశయం నీటిమట్టం పెరుగుతోంది. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్ కు 1 లక్షా 3 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోందని అధికారులు చెప్పారు. దీంతో ఇవాళ ఉదయం 6 గంటల వరకు ప్రాజెక్ట్ నీటిమట్టం 861.70 అడుగులకు చేరింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. మరోవైపు ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటినిల్వ 111.40 టీఎంసీలకు చేరింది. ఇక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరిగింది. దీంతో కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.