Rain alert to Telugu States: రెండు రోజులు తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన!

Rain Alert to Telugu States: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల ప్రభావం అంతగా కనిపించడం లేదు. దాదాపు నెలరోజుల క్రితమే తెలంగాణ, ఏపీలోకి ప్రవేశించినా.. ఇంతవరకు సరైన వర్షాలు పడలేదు. దీంతో వ్యవసాయ పనులు మొదలు పెడదామన్న రైతన్నలకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలోనే వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరంలో సముద్ర మట్టానికి 7.6 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లోనూ మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలంగాణ, ఏపీలో పశ్చిమ, నైరుతి దిక్కు నుంచి గాలులు వీయనున్నాయి. దీంతో నేడు, రేపు రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం చెప్పింది.
ముఖ్యంగా తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసీఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది.
ఇక ఏపీలోనూ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పలు జిల్లాలో వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి జిల్లా, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో వర్షాలు పడనున్నాయని చెప్పింది.