Published On:

Dubai: మరోసారి వార్తల్లో నిలిచిన దుబాయ్‌ క్రౌన్‌ ప్రిన్స్‌..రెస్టారెంట్‌లో అందరి బిల్లు కట్టి

Dubai: మరోసారి వార్తల్లో నిలిచిన దుబాయ్‌ క్రౌన్‌ ప్రిన్స్‌..రెస్టారెంట్‌లో అందరి బిల్లు కట్టి

Dubai Crown Prince: దుబాయ్‌ క్రౌన్‌ ప్రిన్స్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. షేక్‌ హమ్దాన్‌ బిన్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూం ఓ రెస్టారెంట్‌ను సందర్శించారు. రెస్టారెంట్‌లో ఉన్నవారందరికీ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. అందరి బిల్లులు చెల్లించి ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

షేక్‌ హమ్దాన్‌ బిన్‌ మహ్మద్‌ను ముద్దుగా ఫజా అని పిలుస్తుంటారు. అరబిక్‌లో సాయం చేసేవాడు అని అర్థం. అబుదాబీ యువరాజుతో కలిసి షేక్‌ హమ్దాన్‌ స్థానిక మాల్‌లో ఉన్న ఖరీదైన రెస్టారెంట్‌కు వెళ్లారు. అతడి వెంట కొంతమంది స్నేహితులు, సన్నిహితులు వచ్చారు. యువరాజుల రాకను గమనించిన అక్కడ ఉన్నవారు ఎంతో సంతోష పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ మహిళ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

 

యువరాజు రాక మరచిపోని అనుభూతిని మిగిల్చిందని ఆమె పేర్కొన్నారు. రెస్టారెంట్‌కు వచ్చిన వారి బిల్లులు చెల్లించినట్లు చెప్పారు. యువరాజు రెస్టారెంట్‌లో చెల్లించిన బిల్లు రూ.6 నుంచి 7లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రాజకుటుంబం తీరు అద్భుతంగా ఉందని కొందరు పేర్కొన్నారు. దాతృత్వంలో తండ్రి షేక్‌ మహమ్మద్‌ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారని అనేక మంది పోస్టులు పెడుతున్నారు.

 

దుబాయ్‌ క్రౌన్‌ ప్రిన్స్‌గా షేక్‌ హమ్దాన్‌ 2008లో నియమితులయ్యారు. అంతకుముందు 2006 నుంచి 2008 వరకు డిప్యూటీగా కొనసాగారు. కవిత్వం, సాహస క్రీడలపై ఆయనకు మక్కువ. పర్యావరణంతోపాటు దాతృత్వ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తారు.

ఇవి కూడా చదవండి: