Akhanda Godavari Projects: నేడు అఖండ గోదావరి ప్రాజెక్ట్ కు శంకుస్థాపన..!

Akhanda Godavari Project: గోదావరి నది పరిసర ప్రాంతాల అభివృద్ధి, పర్యాటక వసతుల కల్పన కోసం చేపడుతున్న అఖండ గోదావరి ప్రాజెక్ట్ పనులను నేడు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రాజమండ్రిలోని పుష్కర ఘాట్ వద్ద కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి చేతుల మీదుగా కార్యక్రమం నిర్వహించనున్నారు. అఖండ గోదావరి ప్రాజెక్ట్ పనులతో గోదావరి నది అందాలు మరింత పెరగనున్నాయని నేతలు భావిస్తున్నారు. ఈసందర్భంగా వందేళ్ల చరిత్ర కలిగిన హెవలాక్ వంతెనకు సరికొత్త సొబగులు దిద్దనున్నారు. మరోవైపు గోదావరి నదిలోని మధ్యలంకలో రిసార్టులు ఏర్పాటు చేయనున్నారు.
అలాగే హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో బోటు ప్రయాణాలను మొదలు పెట్టనున్నారు. 2027లో జరగబోయే గోదావరి పుష్కరాల నాటికి పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు చేస్తున్నారు. అందుకు సంబంధించి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేస్తున్నాయి. గోదావరి తీరానికి వచ్చే వారికి ఆహ్లాదం, ఆనందం కలిగేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే అఖండ గోదావరి పనులతో పర్యాటకంగాను ఎంతో అభివృద్ధి జరగనుంది. దీంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు అందనున్నాయి.