Tirumala: 28 నుంచి తిరుచానూరు బ్రహ్మోత్సవాలు.. భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
Tiruchanoor Padmavathi Brahmotsavam: ఈ నెల 28 నుంచి తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 6 వరకు నిర్వహించే ఉత్సవాలను టీటీడీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీటీడీ ఈవో శ్యామలారావు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ మేరకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుచానూరు పసుపు మండలం నుంచి పుష్కరిణి, ఆలయ వీధుల్లో జరుగుతున్న ఏర్పాట్లను ఈవో పరిశీలించారు. చలువ పందిళ్లు, రంగోళీలు, క్యూ లైన్ల, బారికేడ్లు తదితర పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
పంచమ తీర్థం వేడుకలకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలి..
బ్రహ్మోత్సవాల్లో పంచమ తీర్థం వేడుకలకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు. ఆలయం, పరిసర ప్రాంతాల్లో విద్యుత్ అలంకరణ, పీఏ సిస్టం, ఎల్ ఈడీ తెరలు వంటి వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జరిగే కళా బృందాల ప్రదర్శనలు ఆకట్టుకునేలా ఉండాలని సూచించారు. తిరుపతి మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణి, శిల్పారామం, తిరుచానూరు అస్థాన మండపంలో ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించునున్నట్లు తెలిపారు. భక్తులను ఆకట్టునే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.