Last Updated:

Chandrababu Naidu : కొడాలి నానిపై నిప్పులు చెరిగిన తెదేపా అధినేత చంద్రబాబు..

‘ఇదేం ఖర్మ’ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు గత రాత్రి గుడివాడలో రోడ్ షో నిర్వహించారు. అనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో కోడికత్తి డ్రామా ఆడారని.. టీడీపీకి సంబంధం ఉందని ఆరోపణలు చేశారన్నారు.

Chandrababu Naidu : కొడాలి నానిపై నిప్పులు చెరిగిన తెదేపా అధినేత చంద్రబాబు..

Chandrababu Naidu : ‘ఇదేం ఖర్మ’ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు గత రాత్రి గుడివాడలో రోడ్ షో నిర్వహించారు. అనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో కోడికత్తి డ్రామా ఆడారని.. టీడీపీకి సంబంధం ఉందని ఆరోపణలు చేశారన్నారు. కోడికత్తి ఒక నాటకం అని తాను ఆనాడే చెప్పాను.. ఇప్పుడు ఎన్ఐఏ కూడా అదే తేల్చిందన్నారు. నిందితుడు శ్రీనివాస్‌ వైఎస్సార్‌సీపీ వ్యక్తే.. ఎన్నికల ముందు సానుభూతి కోసం ప్రశాంత్ కిషోర్ ఆడించిన డ్రామా అన్నారు.

అదే విధంగా బాబాయి హత్యతో సీఎం జగన్ సానుభూతి పొందారని విమర్శించారు. 2004లో ఎన్నికల్లో అఫిడవిట్‌ ప్రకారం వైఎస్సార్‌ కుటుంబం ఆస్తి 1.7 కోట్లని.. ఇప్పుడు 29 రాష్ట్రాల సీఎంల ఆస్తి రూ. 505 కోట్లు అయితే.. ఒక్క ఏపీ సీఎం ఆస్తి అంతకన్నా ఎక్కువే ఉందన్నారు. టీవీలు, పేపర్లు, వ్యాపారాలు లేవనే నిరుపేద జగన్‌ ఏం చేసి రూ. 510 కోట్లు సంపాదించారో చెప్పాలని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పుట్టిన గడ్డ నిమ్మకూరు.. ఎమ్మెల్యేగా గెలిచిన సీటు గుడివాడ అన్నారు చంద్రబాబు. యుగ పురుషుడు తిరిగిన గుడివాడలో.. నేడు గంజాయి మొక్క వచ్చింది అన్నారు. ప్రతి ఒక్కరు ఒక జెండా పట్టుకుని రోడ్డు మీదకు వస్తే ఈ బూతుల ఎమ్మెల్యే రోడ్డు మీదకు వస్తాడా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఆ ఎమ్మెల్యేకి రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీనే – చంద్రబాబు (Chandrababu Naidu)

కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీనే.. గాడి తప్పిన వీళ్లను చరిత్ర హీనులుగా నిలబెడతామన్నారు. ఎన్టీఆర్‌ గెలిచిన గుడివాడను పేకాట క్లబ్బులుగా మార్చారని.. క్యాసినోలు తెచ్చారు.. క్యాబరేలు చేయించారు అన్నారు. భూకబ్జాలు, ఇసుక మాఫియా, మట్టి మాఫియా.. అన్నీ అరాచకాలే అన్నారు. అభివృద్ధి పట్టదని.. నోరు విప్పితే బూతులే అన్నారు. అలాంటి వ్యక్తిని ఏం చేయాలో ప్రజలే తేల్చండి అన్నారు. నిన్నటి వరకు తానే గెలుస్తా తెలుగు దేశం లేదు అని సీఎం అన్నారని.. ఆకాశంలో తిరుగుతున్న జగన్‌ను భూమి మీదకు దింపాలి అనుకున్నానన్నారు. పట్ట భద్రుల ఎన్నికల్లో అన్ని సీట్లూ టీడీపీనే గెలిచిందని.. ఈ ఎన్నికల ఫలితాలతో ఆకాశంలో ఉండే వ్యక్తి కిందకు చూడడం మొదలు పెట్టారన్నారు.

 

నాలుగేళ్లుగా రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తున్నామన్నారు. రాష్ట్రంలో అన్ని ధరలు పెరిగాయి.. మద్యం సైతం నాసిరకంగా ఉందన్నారు. కిరాణా షాపులో కూడా ఆన్ లైన్ లావాదేవీలు తీసుకుంటున్నారు.. మరి మద్యం షాపుల్లో ఎందుకు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు. హైదరాబాద్ కంటే మెరుగైన నగరం కావాలని అమరావతిని మొదలు పెట్టానని.. కానీ మూడు రాజధానులు అని మూడు ముక్కలాట ఆడారన్నారు. రాష్ట్రంలో 10 లక్షల కోట్ల అప్పు చేశారు.. ఒక్కొక్కరిపై రెండు లక్షల కోట్ల అప్పులు పెట్టారన్నారు. ఎన్నికల ముందు కేంద్రం మెడలు వంచుతాను అని చెప్పిన జగన్.. ఇప్పుడు మెడలు దించారన్నారు. జగన్ చెప్పిన ప్రత్యేక హోదా పోయింది.. పోలవరాన్ని ముంచేశారన్నారు. 9 నెలల్లోనే పట్టిసీమ కట్టి రైతులకు నీళ్లు అందించిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు.