Growth rate : వృద్ధి రేటులో 2 స్థానంలోకి ఏపీ.. ఇది ప్రజల సమష్టి విజయమన్న సీఎం చంద్రబాబు

Growth rate : దేశంలో వృద్ధిరేటు మెరుగ్గా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ టాప్‌లోకి వచ్చింది. స్థిర ధరల్లో 8.21 శాతం వృద్ధి రేటుతో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. 9.69 శాతంతో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. ఆదివారం సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ నివేదిక విడుదల చేసింది. ఏడాది కాలంలో ఆంధ్రప్రదేశ్ వృద్ధిరేటు 2.02 శాతం పెరిగి 8.21గా నమోదైంది. ప్రస్తుత ధరల విభాగంలో 12.02 శాతంగా ఉంది.
హర్షం వ్యక్తంచేసిన సీఎం..
వృద్ధిరేటులో ఏపీ దేశంలోనే రెండో స్థానానికి చేరడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’లో ముఖ్యమంత్రి స్పందించారు. ‘ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్’ అంటూ సీఎం పోస్ట్ చేశారు. కూటమి ప్రభుత్వ తీసుకున్న చర్యలతో వృద్ధిరేటు సాధించామని పేర్కొన్నారు. ఇది రాష్ట్ర ప్రజల సమష్టి విజయమంటూ చంద్రబాబు అభినందనలు తెలిపారు. బంగారు భవిష్యత్ కోసం కలిసి ప్రయాణం కొనసాగిద్దామని సీఎం పిలుపునిచ్చారు.