Avanthi Srinivas: వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన మాజీ మంత్రి
EX Minister Avanthi Srinivas Resign to YSRCP: వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన పార్టీని వీడడంతో పాటు ఆ పార్టీ సభ్యత్వం, భీమిలి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బాధ్యతలకు సైతం రాజీనామా చేశారు. ఆయన పార్టీని వీడుతున్నట్లు ప్రకటించడంతో పాటు రాజీనామా లేఖను వైసీపీ అధిష్టానానికి పంపించారు.
అంతకుముందు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో అవంతి శ్రీనివాస్ పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయన గత ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయింది. దీంతో అప్పటి నుంచి అవంతి శ్రీనివాస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
ఇందులో భాగంగానే ఆయన రాజీనామా ప్రకటించినట్లు తెలుస్తోంది. అయితే వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు ఆయన నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కాగా, చిరంజీవి ఆశీస్సులతో 2009లో రాజకీయాల్లోకి వచ్చానని, నాగబాబు, చిరంజీవి వల్లే భీమిలి ఎమ్మెల్యేగా గెలిచానని పేర్కొన్నారు.
నా రాజకీయ జీవితంలో నయాపైసా అవినీతికి పాల్పడలేదని చెప్పుకొచ్చారు. ప్రజలు ఎందుకు తిరస్కరించారో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వానికి కనీసం ఏడాది అయినా సమయం ఇవ్వాల్సి ఉండేదని, 6 నెలల నుంచే దాడికి దిగడం మంచిది కాదని భావించానని తెలిపారు.
అలాగే, పార్టీలో కార్యకర్తలు, నాయకులకు గౌరవం కొరవడిందని చెప్పుకొచ్చారు. పార్టీలో అందరినీ అడగకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. అయితే జమిలి ముంచుకొస్తోందని ధర్నాలు చేయమని ఒత్తిడి చేస్తున్నారన్నారు. 5 నెలల తిరగకుండా ధర్నాలు చేయడం మంచిది కాదని, ప్రతీ విషయంలోనూ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా చేస్తున్నారన్నారు.