Last Updated:

Keshub Mahindra: మహీంద్రా గ్రూప్‌ మాజీ ఛైర్మన్‌ కేశుబ్‌ మహీంద్రా కన్నుమూత

మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రూప్‌ గౌరవ ఛైర్మన్‌, ప్రముఖ బిజినెస్ మెన్ కేశుబ్‌ మహీంద్రా (99) కన్నుమూశారు.

Keshub Mahindra: మహీంద్రా గ్రూప్‌ మాజీ ఛైర్మన్‌ కేశుబ్‌ మహీంద్రా కన్నుమూత

Keshub Mahindra: మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రూప్‌ గౌరవ ఛైర్మన్‌, ప్రముఖ బిజినెస్ మెన్ కేశుబ్‌ మహీంద్రా (99) కన్నుమూశారు. ఈ విషయాన్ని మహీంద్రా అండ్ మహీంద్రా మాజీ ఎండీ పవన్‌ గోయెంకా తన ట్విటర్ ఖాతా ద్వారా ధ్రువీకరించారు.

 

అనేక రంగాలకు విస్తరించడంలో కీలక పాత్ర(Keshub Mahindra)

1963 నుంచి 2012 వరకు మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌గా కేశుబ్‌ మహీంద్రా వ్యవహరించారు. ఆగష్టు 9, 2012 న మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ గా పదవీ విరమణ చేశారు. అనంతరం ఆనంద్ మహీంద్రాకు పగ్గాలు అప్పగించారు. 1947లో కంపెనీలో చేరిన కేశుబ్‌.. సంస్థను అనేక రంగాలకు విస్తరించడంలో ముఖ్య పాత్ర పోషించారు. ఆయన వ్యాపారంలోకి ప్రవేశించిన నాటికి మహీంద్రా కంపెనీ ప్రధానంగా విల్లీస్‌ జీప్‌లను తయారు చేస్తుండేది. ఇప్పుడు మహీంద్రా గ్రూప్‌ వాహన, ఇంధనం, సాఫ్ట్‌వేర్‌ సేవలు, స్థిరాస్తి, ఆతిథ్యం, రక్షణ.. ఇలా పలు రంగాలకు విస్తరించింది.

ఆయనకు మహీంద్రా సెయిల్, టాటా స్టీల్, టాటా కెమికల్స్, ఇండియన్ హోటల్స్ మరియు ఐసిఐసిఐతో సహా అనేక కంపెనీల బోర్డులలో పనిచేసిన అనుభవం ఉంది.

హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్‌గా కూడా కేశుబ్ పనిచేశారు. 48 ఏళ్ల పాటు మహీంద్రా గ్రూప్ కు నాయకత్వం వహించారు.

ఆటో మొబైల్ తయారీదారు నుంచి ఐటీ, రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ , హాస్పిటాలిటీ లాంటి ఇతర వ్యాపార విభాగాలకు విస్తరించారు.

 

భారత్‌లో అత్యంత వృద్ధ బిలియనీర్‌గా

1923 అక్టోంబరు 9న సిమ్లాలో జన్మించిన కేశుబ్‌ మహీంద్రా.. అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు.

1945లో ఆయన తండ్రి జగదీశ్‌ చంద్ర మహీంద్రా తన సోదరుడు కైలాశ్‌ చంద్ర మహీంద్రాతో కలిసి మాలిక్‌ గులామ్‌ మహ్మద్‌ భాగస్వామ్యంలో ‘మహీంద్రా అండ్‌ మహ్మద్‌’ కంపెనీని నెలకొల్పారు.

1947లో కేశుబ్‌ కంపెనీలో చేరారు. తదనంతర పరిణామాల్లో కంపెనీ ‘మహీంద్రా అండ్‌ మహీంద్రా’గా పేరుమార్చుకుంది.

ప్రస్తుతం మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌గా ఉన్న ఆనంద్‌ మహీంద్రా జగదీశ్‌ చంద్ర మహీంద్రా మనవడు.

కాగా, ఇటీవల వెల్లడైన ఫోర్బ్స్‌ కుబేరుల జాబితాలో 1.2 బిలియన్‌ డాలర్ల సంపదతో భారత్‌లో అత్యంత వృద్ధ బిలియనీర్‌గా కేశుబ్ స్థానం దక్కించుకున్నారు.