Last Updated:

Siblings Reunited: 75 ఏళ్ల తర్వాత కలుసుకున్న అక్కా, తమ్ముడు..ఎక్కడో తెలుసా?

 దేశ విభజన సమయంలో విడిపోయిన అక్కా, తమ్ముడు చివరకు 75 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. వృద్ధాప్యం వల్ల వీల్‌ చైర్‌కు పరిమితమైన వారిద్దరూ ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు

Siblings Reunited: 75 ఏళ్ల తర్వాత కలుసుకున్న అక్కా, తమ్ముడు..ఎక్కడో తెలుసా?

 Siblings Reunited:  దేశ విభజన సమయంలో విడిపోయిన అక్కా, తమ్ముడు చివరకు 75 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. వృద్ధాప్యం వల్ల వీల్‌ చైర్‌కు పరిమితమైన వారిద్దరూ ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. 1947లో దేశ విభజన జరిగినప్పుడు పంజాబ్‌లో నివసించే సర్దార్ భజన్ సింగ్ కుటుంబం దారుణంగా నలిగిపోయింది. ఆ కుటుంబానికి చెందిన వారు చెల్లాచెదురయ్యారు. తోబుట్టువులైన మహేంద్ర కౌర్, అజీజ్‌ లు విడిపోయారు. సోదరి కౌర్‌ తన కుటుంబంతో కలిసి భారత్‌లో ఉండగా, సోదరుడు అజీజ్‌ పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)కు వెళ్లాడు. చిన్నతనంలోనే ముస్లిం యువతిని పెళ్లి చేసుకుని తన కుటుంబంతో కలిసి అక్కడ స్థిరపడ్డాడు. అయితే  అజీజ్‌ ఎప్పుడూ కూడా భారత్‌లోని తన కుటుంబ సభ్యులను కలుసుకోలేకపోయాడు.

సోషల్‌ మీడియా ద్వారా వెలుగులోకి.. (Siblings Reunited)

కాగా, తోబుట్టువులైన కౌర్‌, అజీజ్‌ దేశ విభజన సమయంలో విడిపోయిన సంగతి సోషల్‌ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ విషయం ఆ రెండు కుటుంబాలకు తెలిసింది. ఈ నేపథ్యంలో విడిపోయిన 75 ఏళ్ల తర్వాత కలుసుకోవాలని అక్కా, తమ్ముడు భావించారు. భారత్, పాకిస్థాన్‌ను కలుపుతూ సరిహద్దులో ఏర్పాటు చేసిన కర్తార్‌పూర్‌ కారిడార్‌లో ఆ రెండు కుటుంబాలు ఆదివారం కలిశాయి. భారత్‌కు చెందిన 81 ఏళ్ల మహేంద్ర కౌర్, పీవోకేకు చెందిన 78 ఏళ్ల సోదరుడు షేక్ అబ్దుల్ అజీజ్‌ 75 ఏళ్ల తర్వాత తొలిసారి స్వయంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరూ భావోద్వేగానికి గురయ్యారు. రెండు కుటుంబాల వారు ఒకరిని ఒకరు అప్యాయంగా పలుకరించుకున్నారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. అనంతరం గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను సందర్శించారు. ఇలా కలుసుకునేందుకు సహకరించిన ఇరు దేశాల ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు.

మరోవైపు దేశ విభజనప్పుడు విడిపోయిన అక్క కౌర్‌, తమ్ముడు అజీజ్‌ 75 ఏళ్ల తర్వాత కలుసుకోవడం చూసి కర్తార్‌పూర్‌ అధికారులు కూడా చలించిపోయారు. ఇరు కుటుంబాలను పూలమాలలతో సత్కరించారు. వారికి స్వీట్లు పంపిణీ చేశారు. కాగా, 75 ఏళ్ల తర్వాత కలిసిన ఈ తోబుట్టువుల వీడియో క్లిప్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.