Mood Of Thammudu Movie: నితిన్ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్.. ఎవరెవరు ఏ పాత్రలో కనిపిస్తున్నారంటే?

Mood of Thammudu: ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోల్లో నితిన్ ఒకడు. చాలా ఏళ్ళ నుంచి నితిన్ కూడా ఒక భారీ హిట్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. భీష్మ లాంటి హిట్ కాంబో రాబిన్ హుడ్ సినిమాతో వచ్చినా అది ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. అయినా నితిన్ అధైర్య పడకుండా మరో సినిమాను పట్టాలెక్కించడమే కాకుండా రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు.
నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తమ్ముడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఒకరు కాదు ఇద్దరు కాదు.. ముగ్గురు హీరోయిన్లు సందడి చేశారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ లయ.. చాలా గ్యాప్ తరువాత ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తుంది. నితిన్ సరసన అయితే వర్ష బొల్లమ్మ, కాంతార ఫేమ్ సప్తమి గౌడ నటిస్తున్నారు. వీరితో పాటు ఇంకో కీలక పాత్రలో లబ్బరు పందు సినిమాతో తెలుగువారిని ఆకట్టుకున్న స్వశిక నటిస్తోంది.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా జూలై 4 న రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. తాజాగా మూడ్ ఆఫ్ తమ్ముడు అంటూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ఎవరెవరు ఏఏ పాత్రల్లో నటిస్తున్నారో చెప్పుకొచ్చారు. రత్నగా సప్తమి కనిపిస్తుందని, స్వశిక.. గుత్తి అనే పాత్రలో కనిపించనుందని చెప్పుకొచ్చారు.
ఇక లయ.. ఝాన్సీ కిరణ్మయిగా కనిపిస్తుండగా.. చిత్రగా వర్ష బొల్లమ్మ నటిస్తుంది. అనిమల్ సినిమాతో విలన్ గా మంచి పేరు తెచ్చుకున్న సౌరభ్ సచ్దేవ.. అగర్వాల్ గా కనిపించనున్నాడు. ఇక చివర్లో నితిన్ ఆర్చరీ పట్టుకొని ఇండియా తరుపున ఆడుతున్నట్లు చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో నితిన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.