Aamir Khan on Khan’s Movie : ఖాన్‌ల సినిమా తప్పకుండ ఉంటుంది – ‘మహాభారత్’ పనులు ప్రారంభించాం..

Aamir khan About a film With Shah Rukh and Salman: బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. రేపు మార్చి 14న ఆయన 60వ పుట్టిన రోజు. ఈ సందర్బంగా తన బర్త్‌డే మీడియాతో సెలబ్రేట్ చేసుకున్నారు. మీడియా సమక్షంలో కేక్ కట్ చేసి కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా తన అప్‌కమింగ్ మూవీస్.. సల్మాన్, షారుక్ ఖాన్‌లతో తనకు ఉన్న అనుబంధాన్ని గురించి చెప్పుకొచ్చారు. ఖాన్‌లను ఒకే తెరపై చూడాలన్నది బాలీవుడ్ ప్రేక్షకులు, అభిమానుల ఆశ.
ఈ ముగ్గురి కాంబో సినిమా ఎప్పెడెప్పుడు వస్తుందా అని అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదే విషయాన్ని తాజాగా ఆమిర్ ప్రశ్నించగా.. త్వరలో వస్తుందని ఊహించని కామెంట్స్ చేశారు. ముగ్గురం కలిసి ఓ సినిమా చేయాలని మేము కూడా ఆలోచిస్తున్నాం. ఓ మంచి స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకులు కూడా దాని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనుకుంటా. మేము(షారుక్, సల్మాన్, ఆమిర్) కూడా కలిసి చేయడంపై చర్చించుకున్నాం. ఏదైన మంచి స్క్రిప్ట్ వస్తే కలిసి సినిమా చేసేందుకు మేం సిద్దంగా ఉన్నాం. కచ్చితంగా మా కాంబినేషన్‌లో ఓ సినిమా అయితే ఉంటుంది” అంటూ అభిమానులకు పండగలాంటి అప్‌డేట్ ఇచ్చారు.
ఆ తర్వాత తన డ్రీమ్ ప్రాజెక్ట్‌పై కూడా స్పందించారు. “నా డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారత్. భారీ స్థాయిలో దీనిని సిద్ధం చేస్తున్నాం. ఇప్పటికే ఈ మూవీ పనులు కూడా ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతానికి స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఇందుకోసం ప్రత్యేకమైన టీంని రెడీ చేసే పనిలో ఉన్నాం. ఈ మూవీ కోసం ఎన్నో అంశాలను అన్వేషిస్తున్నాం. త్వరలోనే స్క్రిప్ట్ పనులు ప్రారంభించాలని అనుకుంటున్నాం. చూడాలి ఏం జరుగుతుందో” అని అన్నారు. గతంలో ఆమిర్ మహాభారత్ మూవీ గురించి చెప్పుకోచ్చారు. మహాభారత్ మీద సినిమా చేయడమంటే ఒక యజ్ఞంతో సమానమని, దానిని విశిష్టతకు భంగం కలిగించకుండా సినిమా రూపొందించేందుకు శ్రమిస్తున్నామని తెలిపారు.