Balagam Actor GV Babu Died: ఇండస్ట్రీలో విషాదం.. ‘బలగం’ నటుడు జీవీ బాబు కన్నుమూత!

Balagam actor GV Babu Passed Away: ‘బలగం’ మూవీ నటుడు జీవీ బాబు అనారోగ్యంతో మరణించారు. కొంతకాలంగా ఆయన మూత్రపిండాల సమస్యతో బాధపుడుతున్న సంగతి తెలిసిందే. వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కొంతకాలం ఆయన రెండు కిడ్నీలు దెబ్బ తినడంతో పాటు గొంతు ఇన్ఫెక్షన్ వచ్చింది. దీంతో ఆయన మాట్లాడలేని స్థితికి వెళ్లారు. కిడ్నీ సమస్య వల్ల ఆయన డయాలసిస్ కోసం ఆర్థిక ఇబ్బందులు వచ్చిన సమయంలో దర్శకుడు వేణు, నటుడు ప్రియదర్శి కొంత సాయం చేశారు.
ఆస్పత్రి ఖర్చులు అంతకు మించి ఉండటంతో ఆర్థిక సాయం కోసం కావాలని ఆయన కుటుంబ సభ్యులు కోరారు. ఇటీవల ఆయన కుటుంబ సభ్యులు వైద్య ఖర్చుల కోసం ఇండస్ట్రీని, ప్రభుత్వాన్ని ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతలో జీవీ బాబు ఆరోగ్యం విషమించి మృతి చెందడంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ బలగం డైరెక్టర్ వేణు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “జీవీ బాబుగారు ఇకలేరు. ఆయన జీవితం మొత్తం నాటక రంగంలోనే గడిపారు. చివరి రోజుల్లో ఆయన్ని బలగం ద్వారా పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.
కాగా సినిమాలకు ముందు స్టేజ్ షోలు చేసుకునే ఆయన స్వతహాగా రంగస్థల కళాకారుడు. ఎన్నో స్టేజ్ షోలు, నాటకాలు కూడా వేసేవారు. ఈ క్రమంలో వేణు దర్శకత్వంలో తెరకెక్కిన బలగం చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషించిన కొమురయ్యకు తమ్ముడిగా అంజన్న పాత్రలో కనిపించారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ని విశేషంగా ఆకట్టుకుంది. చిన్న సినిమాగా వచ్చిన ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు పొందింది. దీంతో ఈ సినిమాలోని ప్రధనా పాత్రదారులందరికి మంచి గుర్తింపు రావడం విశేషం.
ఇవి కూడా చదవండి:
- Tripti Dimri in Spirit Movie: ‘స్పిరిట్’ కోసం ‘యానిమల్’ బ్యూటీ.. హీరోయిన్ ఎవరో చెప్పేసిన సందీప్ రెడ్డి వంగా!