Last Updated:

Guntur Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

Guntur Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

Road Accident at Guntur District Three Womens Dead: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పని నిమిత్తం కూలీలను తీసుకెళ్తున్న ఆటోను గుంటూరు జిల్లాలోని నారాకోడూరు-బుడంపాడు గ్రామాల వద్ద ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో అరుణకుమారి, నాంచారమ్మ, సీతారావమ్మ ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో మహిళను గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులంతా చేబ్రోలు మండంలోని సుద్దపల్లి వాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోవడం చాలా బాధాకరమన్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యలను ఆదేశించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. మిరప పొలంలో పని చేసేందుకు చేబ్రోలు మండలంలోని సుద్దపల్లి నుంచి మహిళా కూలీలను ఆటోలో తీసుకెళ్తుండగా.. రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నట్లు పొన్నూరు గ్రామీణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కోటేశ్వరరావు తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై మంత్రి దుర్గేష్ ఆరా తీశారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి దుర్గేష్ వెల్లడించారు.