Road Accident: లారీని బొలెరో ఢీకొని ఇద్దరు దుర్మరణం

Accident Near Anakapalli: ఆగిఉన్న లారీని బొలెరో ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందగా.. మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం ఉగ్గినపాలెం సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. కడిపిలంక నుంచి పూలు కొనుగోలు చేసిన అనంతరం అనకాపల్లికి చెందిన ఇద్దరు మహిళలు ఇవాళ తెల్లవారుజామున స్వగ్రామానికి బయల్దేరారు. వారు ప్రయాణిస్తున్న బొలెరో వాహనం.. హైవేపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొంది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించారు. అనంతరం ప్రమాదంలో చనిపోయిన బొలెరో డ్రైవర్, మహిళ వాహనంలో ఇరుక్కుపోవడంతో క్రేన్ సాయంతో వెలికితీశారు. పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే మృతుల వివరాలు తెలియలేదు. కాగా జాతీయ రహదారిపై ప్రమాదం జరగడంతో ఉగ్గినపాలెం నుంచి ఎలమంచిలి వరకు ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.