Israel: హామాస్ అంతమే ఇజ్రాయెల్ లక్ష్యం

Israel- Hamas War: గాజాతో 60 రోజుల పాటు కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ తీవ్ర హెచ్చరికలు చేశారు. భవిష్యత్తులో హమాస్ ఉండదని.. హమస్థాన్ ఉండదంటూ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గబోమని, హమాస్ ను పూర్తిగా పునాదులు లేకుండా అంతం చేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు.
కాగా కాల్పుల విరమణకు కొత్త ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు హమాస్ వెల్లడించింది. ఇజ్రాయెల్ దళాలు.. గాజా నుంచి ఉపసంహరించుకునేలా చేయడమే తమ లక్ష్యమని హమాస్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తుల నుంచి తమకు సూచనలు వచ్చాయని, వాటిని సమీక్షిస్తున్నామని హమాస్ బృందం చెప్పింది. ఈ ప్రకటన తర్వాత నెతన్యూహు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హమాస్ నామరూపాలు లేకుండా చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.