IPL 2025: ఉత్కంఠ పోరు.. లక్నోపై ఢిల్లీ సంచలన విజయం

Delhi Capitals Beat Lucknow Super Giants, DC Won By One Wicket: ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఉత్కంఠపోరులో చివరికి ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. విశాఖపట్నం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో ఒక వికెట్ తేడాతో ఓటమి చెందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగులు చేసింది. తర్వాత 210 పరుగుల లక్ష్యఛేదనను ఢిల్లీ 19.3ఓవర్లలోనే ఛేదించింది.
అంతకుముందు బ్యాటింగ్ చేపట్టిన లక్నో ఓపెనర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మిచెల్ మార్ష్(72, 36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేశాడు. మార్క్రమ్(15) పెవిలియన్ చేరిన తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్(75, 30 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లు) చెలరేగి ఆడాడు. దీంతో లక్నో భారీ స్కోరు దిశగా కొనసాగింది. అయితే,ముఖేశ్ బౌలింగ్‌లో మార్ష్ క్యాచ్ ఔట్ అయ్యాడు. 13 ఓవర్లు 2 వికెట్ల నష్టానికి 161 పరుగులు ఉన్న లక్నోను ఢిల్లీ బౌలర్లు దెబ్బతీశారు. దీంతో 250 స్కోరు సులువుగా కనిపించినా వరుసగా వికెట్లు కోల్పోయింది. పంత్(0), బదోనీ(4), ఠాకూరు(0), అహ్మద్(9), రవి బిష్ణోయ్(0) ఔట్ అయ్యారు. మిల్లర్(27) అఖరిలో భారీ షాట్లు ఆడడంతో లక్నో 209 పరుగుల మార్క్‌ను చేరింది. ఢిల్లీ బౌలర్లలో స్లార్క్ 3 వికెట్లు పడగొట్టగా.. కుల్‌దీప్ 2, విప్రాజ్ నిగమ్, ముకేశ్ కుమార్ చెరో వికెట్ తీశారు.
210 పరుగుల లక్ష్యఛేదనలో ఢిల్లీ ఆరంబంలోనే బిగ్ షాక్ తగిలింది. తొలి ఓవర్‌లోనే ఢిల్లీ రెండు కీలక వికెట్లు కోల్పోయింది. శార్దూల్ వేసిన తొలి ఓవర్‌లో జేక్ ఫ్రేజర్(1), ఇషాన్ పోరెల్(0) పెవిలియన్ చేరారు. తర్వాత ఓవర్‌లో సమీర్ రిజ్వి(4) ఔట్ అయ్యాడు. దీంతో 7 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ తరుణంలో కెప్టెన్ అక్షర్ పటేల్(22), డుప్లెసిస్(29) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అయితే వరుసగా అక్షర్, డుప్లెసిస్ ఔట్ కావడంతో ఢిల్లీకి ఓటమి ఖాయమని అందరూ అనుకున్నారు. 113 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఢిల్లీని విప్ రాజ్ నిగమ్(39), అశుతోస్(66) ఆదుకున్నారు. చివరి వరకు పోరాడి విజయాన్ని అందించారు. లక్నో బౌలర్లలో శార్దుల్, సిద్ధార్థ్, దిగ్వేశ్, రవి బిష్ణోయ్ తలో రెండు వికెట్లు తీశారు.