Last Updated:

Operation Akarsh: తెరాస నేతల ఆకర్ష్ డీల్ పై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం.. భాజపా అధ్యక్షుడు బండి సంజయ్

మెయినాబాద్ ఫామ్ హౌస్ లో పోలీసులకు రెడ్ హ్యాండడ్ గా పట్టుబడిన తెరాస శాసనసభ్యుల ఆకర్ష్ ఘటన పై న్యాయస్ధానాన్ని ఆశ్రయించనున్నట్లు భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు.

Operation Akarsh: తెరాస నేతల ఆకర్ష్ డీల్ పై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం.. భాజపా అధ్యక్షుడు బండి సంజయ్

Hyderabad: మెయినాబాద్ ఫామ్ హౌస్ లో పోలీసులకు రెడ్ హ్యాండడ్ గా పట్టుబడిన తెరాస శాసనసభ్యుల ఆకర్ష్ ఘటన పై న్యాయస్ధానాన్ని ఆశ్రయించనున్నట్లు భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. పోలీసుల ఎఎఫ్ఐఆర్ లో ప్రలోభానికి గురిచేసిన వ్యక్తుల పేర్లను చేర్చకుండా ఆ స్థానంలో భాజపా అని వ్రాయడం పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రూ.400 కోట్ల రూపాయల తెరాస శాసనసభ్యుల 4గురి కొనుగోళ్ల డీల్ పై బండి సంజయ్ ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసిఆర్, పోలీసు ఉన్నతాధికారుల తీరు పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచేందుకు ఇంత డ్రామా అవసరమా కేసిఆర్ అంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని రెండు మూడు ఛానళ్లు ప్రభుత్వంతో లాలూచీ అయ్యాయన్నారు. ఫాం హౌస్ ఎవరిది, డబ్బులు తరలించిన ఎమ్మెల్యే బంధువు ఎవరు, ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఆ ఎమ్మెల్యే కు భాజపా నేతలకు ఏమైన సంబంధాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. బాధితులు, ఆరోపణలు, సంఘటన ప్రాంతాలు అన్ని తెరాస నేతలకు సంబంధించి అయితే, వాటిని భాజపాపైరుద్దేందుకు కుట్రగా బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ డీల్ తతంగంలో ఓ పోలీస్ అధికారి కీలకపాత్ర వహించాడని ఆరోపించారు. సిసి ఫుటేజ్ లు బయటపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఫాం హౌస్, ప్రగతి భవన్, డెక్కన్ ఫ్రైడ్ హోటల్ సిసి ఫుటేజ్ లు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు ఢిల్లీలో ముఖ్యమంత్రి ఎవరెవరిని కలిశారు? కేసులో ప్రలోభానికి గురి చేసిన నలుగురు తెరాస ఎమ్మెల్యే ఫోన్ కాల్ లిస్టులు బయటపెట్టాలని అన్నారు.

స్వామిజీలు, సూత్రదారులుగా ఆరోపిస్తున్న వారి ఫోన్ కాల్ లిస్ట్ లు బయటపెట్టాలన్నారు. తప్పించుకొనేందుకు ఇక వీలుకాదన్నారు. ముఖ్యమంత్రి ల్యాండ్ ఫోన్ లిస్ట్ కూడా బయటకు తీయాలన్నారు. ఇదంతా చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాదన్నారు. కోర్టు ద్వారా లేదా సీబిఐ ద్వారానే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత కూడా స్వాధీనం చేసుకొన్న డబ్బుల సంచులు ఎందుకని బయటపెట్టలేదన్నారు. మీడియాకు ఘటనా స్ధలంలోనే చూపించాలని పోలీసులకు తెలియదా అని బండి సంజయ్ విస్మయం వ్యక్తం చేశారు. రెండు ఛానల్ రిపోర్టర్లకు మాత్రమే సమాచారం ఇవ్వడాన్ని ఎంతవరకు విశ్వసించవచ్చని అన్నారు.

ఇంగితజ్ఞానం ఉండేవాడయితే ఉప ఎన్నికల కోసం ఇంత నీచపనికి సీఎం కేసిఆర్ తలపెట్టడం కరెక్ట్ కాదన్నారు. ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. వాస్తవ విషయాలు బయటకు తీయాల్సిందేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. శుక్రవారం (రేపు) ఉదయం 9గంటలకు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి ముందుకు నేను వస్తాను. డ్రామా ఎపిసోడ్ తో యాదద్రికి వచ్చి ప్రమాణం చేయాలని సీఎం కేసిఆర్ కు సవాల్ విసిరారు. కేసిఆర్ కోసం 9నుండి 10 వరకు వేచివుంటానని బండి సంజయ్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఉప ఎన్నికల్లోనే ఇన్ని చిల్లర వేషాలు వేస్తే, దేశమంతా ఏలేందుకు ఇంకెన్ని చిల్లర వేషాలను కేసిఆర్ వేస్తాడో చూడాలన్నారు. అందుకా బీఆర్ఎస్ అంటూ హేళన చేశారు.

ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన తర్వాత, తెరాస ఎమ్మెల్యేలను ఎక్కడ తీసుకెళ్లాలో తెలియదా అంటూ పోలీసుల చర్యను ఖండించాడు. పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లి వాస్తవాన్ని రికార్డు చేయాల్సిన బాధ్యత లేదా అని బండి ప్రశ్నించారు. అలా చేయకుండా ప్రగతి భవన్ కు తీసుకెళ్లేందుకు ఎంతమేర అధికారం ఉందని పోలీసుల తీరు పై అభ్యంతరం వ్యక్తం చేశారు. చిల్లర వేషాలు, చిల్లర బుద్దులు బంద్ చేయాలని కేసిఆర్ కు హితవు పలికారు. ఎన్నికల రద్దుకు తెరాస ప్లాన్ చేసేందుకే ప్రలోభాల డీల్ ను తెర పైకి తీసుకొచ్చారని బండి సంజయ్ అన్నారు. న్యాయస్ధానంతో పాటు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల దృష్టికి కూడా మెయినాబాద్ ఫాం హౌస్ ఘటనను తీసుకెళ్లనున్నట్లు ఆయన అన్నారు.

ఇది కూడా చదవండి: Operation Akarsh: ఆపరేషన్ ఆకర్ష్ భగ్నం.. 400కోట్ల డీల్ తో తెరాస ఎమ్మెల్యేల కొనుగోలుకు కుట్ర

ఇవి కూడా చదవండి: