Minister Akhil Giri: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి సారీ చెప్పిన బెంగాల్ మంత్రి
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై తృణమూల్ కాంగ్రెస్ మంత్రి అఖిల్ గిరి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. నందిగ్రామ్‌లోని ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన అక్కడి స్థానికులతో మాట్లాడుతున్నారు. ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
West Bengal: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై తృణమూల్ కాంగ్రెస్ మంత్రి అఖిల్ గిరి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. నందిగ్రామ్‌లోని ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన అక్కడి స్థానికులతో మాట్లాడుతున్నారు. ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. “నేను అందంగా లేనని సువేందు అధికారి నన్ను కించపరిచారు. ఆయన మాత్రం అందంగా ఉన్నాడా? ఎవరినైనా సరే రూపాన్ని బట్టి జడ్జ్ చేయటం నాకు ఇష్టం ఉండదు. రాష్ట్రపతి అంటే మాకెంతో గౌరవం ఉంది. కానీ ఆమె చూడటానికి ఎలా ఉంటారు? అని చుట్టూ ఉన్న వారిని అడిగారు. అక్కడి జనమంతా ఒక్కసారిగా గొల్లుమన్నారు.
అఖిల్ గిరి కామెంట్స్ ను పలువురు తప్పు బట్టారు. రాష్ట్రపతి హోదాలో ఉన్న వ్యక్తిని ఇలా కించపరచడం ఏంటి అని మండి పడుతున్నారు. ఇప్పటికే బీజేపీ ఈ వ్యాఖ్యల పై తీవ్రంగా స్పందించింది. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవియా విమర్శించారు. “మంత్రి అఖిల్ గిరి రాష్ట్రపతిని అవమానించారు. మమతా బెనర్జీ గిరిజన వ్యతిరేకి. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికవటం ఆమెకు ఇష్టం లేదు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటు” అని మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్ బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టేందుకి సిద్ధమవుతోంది
మరోవైపు తృణమూల్ ఎంపీ సుస్మితా దేవ్ కూడా దీని పై స్పందించారు. అఖిల్ గిరి బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేశారని మండి పడ్డారు. “ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తి పై అలాంటి వ్యాఖ్యలు చేయటం చాలా దురదృష్టకరం. ఈ కామెంట్స్‌తో తృణమూల్ కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదు. పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలనే వైఖరికి మేము ఎప్పుడూ కట్టుబడి ఉంటాం” అని సుస్మితా దేవ్ స్పష్టం చేశారు. ఈ వివాదం పై అఖిల్ గిరి వివరణ ఇచ్చారు. “నేను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతున్నాను. నేను రాష్ట్రపతిని గౌరవిస్తాను. సువేందు అధికారిని విమర్శించేందుకు మాత్రమే నేను రాష్ట్రపతి పేరుని ప్రస్తావించాను. సువేందు అధికారి గతంలో నాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నేను చూడటానికి బాగుండనని అన్నారు. నేనో మంత్రిని. రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసి ఈ పదవిని చేపట్టాను. నాకు వ్యతిరేకంగా ఏం మాట్లాడినా, అది రాజ్యాంగాన్ని అవమానించడమే అవుతుంది” అని అన్నారు