Tamil Nadu Replaces Rupee Symbol: తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం.. బడ్జెట్ కాపీపై రూపీ(₹) సింబల్ తొలగింపు

Tamil Nadu Government Replaces Rupee Symbol: తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. త్రిభాషా వివాదం నేపథ్యంలో బడ్జెట్ రూపీ(₹) సింబల్‌ను తొలగించింది. ఈ మేరకు రూపీ సింబల్‌కు బదులుగా తమిళ ‘రూ‘ అనే సింబల్‌ను చేర్చినట్లు పేర్కొంది.
రాష్ట్ర భాషకు ప్రాధాన్యత ఇచ్చేందుకు రూపీ సింబల్(₹) స్థానంలో తమిళంలో ‘రూ’ అక్షరాన్ని డీఎంకే ప్రభుత్వం చేర్చింది. కేంద్రం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానంలో త్రిభాషా సూత్రాన్ని డీఎంకే ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. విద్యా విధానంలో ద్విభాషను మాత్రమే అమలు చేస్తామని చెప్పడంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం కొనసాగుతోంది.
తమిళనాడుపై కేంద్ర ప్రభుత్వం హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు గత కొంతకాలంగా ప్రయత్నిస్తుందని డీఎంకే ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఇందులో భాగంగానే సీఎం స్టాలిన్ సంచలన ప్రకటన చేశారు. 2025-26 రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఎంకే స్టాలిన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి రూపీ సింబల్ తొలగించింది. ఈ రూపీ స్థానంలో తమిళ భాష గుర్తును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం రూపీ సింబల్ తొలగించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
గత కొంతకాలంగా త్రిభాషా విధానంపై కేంద్రం, అధికార పార్టీ డీఎంకేకు రాజకీయ వివాదం నెలకొంది. అయితే తమిళనాడు సర్కార్ ఎన్ఈపీతోపాటు త్రిభాషా విధానం అమలు చేసేందుకు నిరాకరించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం సర్వ శిక్షా అభియాన్ కింద కేంద్రం అందించే రూ.573కోట్ల సహాయాన్ని నిలిపివేసింది. కాగా, సర్వ శిక్షా అభియాన్ నిధులు పొందాలంటే రాష్ట్రాలు ఎన్ఈపీ నియమాలను పాటించాల్సి ఉంటుంది. అయితే తమిళనాడు ప్రభుత్వం ఎన్ఈపీ మార్గదర్శకాలను నిరాకరించడంతో నిధులు నిలిచిపోయాయి. ఈ విషయంపై సీఎం స్టాలిన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కావాలనే దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ భాషను బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.