PM Modi Address the Nation: రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగం.. జాతిని ఉద్దేశించి మాట్లాడునున్న ప్రధాని

PM Modi Address the Nation at 8 PM on Operation Sindoor: భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు, కాల్పుల విరమణ నేపథ్యంలో ప్రధాని మోదీ సోమవారం రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. జమ్మూకశ్మీర్‌లోని పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియా ‘ఆపరేషన్ సిందూర్’ను చేపట్టిన విషయం తెలిసిందే. ఆపరేషన్‌లో ఇండియా సైన్యం విజయం సాధించినట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. తీవ్ర సస్పెన్స్ క్రియేట్ చేసిన ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని మోదీ తొలిసారి మీడియా ముందుకు రాబోతున్నారు.
ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైనప్పటి నుంచి త్రివిధ దళాధిపతులు, ఎన్ఎస్ఏ, సీడీఎస్‌తో ప్రధాని మోదీ వరుసగా సమీక్షలు నిర్వహించారు. ఎప్పటికప్పడు వివరాలు తెలుసుకుంటూ అనుసరించాల్సిన వ్యూహాలను భద్రతా దళాలకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటి వరకు ఆపరేషన్‌పై మీడియాలో మాట్లాడని మోదీ ఇవాళ రాత్రికి మీడియా ముందుకు రాబోతున్నారు. దీంతో మోదీ ఏం మాట్లాడబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ వెనక్కి తగ్గడం, కాల్పుల విరమణలో అగ్రరాజ్యం అమెరికా జోక్యం వంటి విషయాల్లో మోదీ ఏం చెప్పబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది.