Published On:

Pahalgam : జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి, మోదీ సీరియస్, కాశ్మీర్ కు అమిత్ షా

Pahalgam : జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి, మోదీ సీరియస్, కాశ్మీర్ కు అమిత్ షా

 

  • దాడిని ఖండించిన సీఎం ఒమర్ అబ్దుల్లా
  • ఆరా తీసిన ప్రధాని మోదీ
  • ఘటనా స్థలానికి వెళ్తున్న అమిత్ షా

 

Pahalgam : జమ్మూ కాశ్మీర్ లోని పహాల్గామ్ లో పర్యాటకులపై జరిగిన దాడిని ఖండించారు సీఎం ఒమర్ అబ్దుల్లా. ఇటీవలి కాలంలో సామాన్య పౌరులపై ఇంతపెద్ద దాడి జరగడం ఇదే మొదటిసారని అన్నారు. మంగళవారం మధ్యాహ్నం 2:30గంటలకు దాడి జరిగింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 20కిపైగా మృతిచెందగా పలువురు గాయపడ్డారు. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

 

దాడిని ఖండించిన సీఎం ఒమర్ అబ్దుల్లా
జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు, ఇది అసహ్యకరమైన, అత్యంత దారుణమైన  చర్యగా అభివర్ణించారు. పహల్గామ్ దాడి తన ఊహకు అందనంత పెద్దగా ఉందన్నారు. బాధిత కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేశారు.

 

బాధితులకు తక్షణ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు సీఎం ఒమర్. పార్టీ వర్గాలు కూడా బాధితులకు సహాయం చేయాలని కోరారు. మంగళవారం మధ్యాహ్నం 2:30గంటలకు దాడి జరుగగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి కాస్త ఆలస్యం అయినట్లుగా తెలుస్తోంది. కాగా.. ఘటన జరిగిన స్థలానికి కాలినడకన లేక గుర్రాలపై వెళ్లేందుకు మాత్రమే అవకాశం ఉంది.

 

గుర్రపు స్వారీని ఆస్వాదిస్తుండగా
పహల్గామ్‌ బైసరన్ పర్వత శిఖరంపై పర్యాటకులు గుర్రపు స్వారీని ఆస్వాదిస్తుండగా ముగ్గురు తీవ్రవాదులు ఒక్కసారిగా దాడికి తెగపడ్డారు. దీంతో 20మంది మృతిచెందగా పలువురు గాయపడ్డారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఒక మహిళ తన భర్తను రక్షించమని ఏడుస్తున్న దృష్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ఈ దాడికి బాధ్యత వహించింది.

 

దాడిపై ప్రధాని మోదీ ఆరా
జమ్మూ కశ్మీర్ లో పర్యాటకులపై జరిగిన దాడిపై ప్రధాని మోదీ ఆరా తీశారు. ప్రస్తుతం ఆయన సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు. హోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి వివరాలను తెలుసుకున్నారు. అమిత్ షాను ఘటనా స్థలానికి వెళ్లి ఆరా తీయవలసిందిగా ఆదేశించారు. దీంతో అప్రమత్తమైన హోం శాఖ ఢిల్లీలో హైలెవల్ మీటింగ్ ను ఏర్పాటు చేసింది. ఇందులో హోం సెక్రటరీతో పాటు సీనియర్ అఫీషియల్స్, జమ్మూ కాశ్మీర్ డీజీపీ పాలుపంచుకున్నారు. జమ్మూ కాశ్మీర్ కు హోం మంత్రి అమిత్ షా మంగళవారం రాత్రి 7 గంటలకు బయలుదేరుతున్నారు.