Published On:

Bengaluru Stampede : 8 లక్షల మంది అభిమానులు వచ్చారు : తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హోంమంత్రి వ్యాఖ్యలు

Bengaluru Stampede : 8 లక్షల మంది అభిమానులు వచ్చారు : తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హోంమంత్రి వ్యాఖ్యలు

Karnataka Home Minister G. Parameshwara : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవాల కోసం 8 లక్షల మంది అభిమానులు తరలివచ్చారని కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర తెలిపారు. దీంతో తొక్కిసలాటకు దారితీసిందన్నారు. విధానసౌధ బయట లక్ష మంది ఉంటారని అంచనా వేశామన్నారు. మైదానం వెలుపల 25 వేల మంది ఉంటారని భావించామన్నారు. 2.5 లక్షల మంది వస్తారని ఊహించలేదని తెలిపారు. బుధవారం 8.70 లక్షల మెట్రో టికెట్లు అమ్ముడు పోయాయన్నారు. అవన్నీ క్రికెట్ అభిమానులవే అనుకుంటే 8 లక్షల మంది తరలివచ్చినట్లు లెక్క చెప్పారు.

 

క్రికెట్ కార్యక్రమం కోసం ఆ స్థాయిలో అభిమానులు గుమిగూడిన సందర్భాలు గతంలో లేవని తెలిపారు. తొక్కిసలాట జరగకుండా ఉంటే ఇది ఒక రికార్డు అయ్యేదన్నారు. తాను ఆర్సీబీ యాజమాన్యం, కర్ణాటక క్రికెట్ సంఘంతో మాట్లాడగా, వారు తమ అభిప్రాయాలు చెప్పారని మంత్రి వెల్లడించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించడానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారుల నుంచి వివరాలు సేకరించారు.

 

అంచనాకు మించి వచ్చారు..
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు తాను ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. గేట్ల వద్ద ఎంతమంది చనిపోయారనే దానిపై తమకు సమాచారం లేదని తెలిపారు. మృతులు 40 ఏళ్లలోపు ఉన్నారని పేర్కొన్నారు. వారిలో 13 ఏళ్ల బాలిక కూడా ఉందని తెలిపారు. బుధవారం తొలుత కర్ణాటకలో దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు విధానసౌధలో సన్మానం జరిగింది. తర్వాత చిన్నస్వామి స్టేడియంలో జట్టు సభ్యులను సన్మానించారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బెంగళూరు జట్టు ఐపీఎల్‌ కప్‌ను సొంతం చేసుకోవడంతో క్రికెట్‌ అభిమానులతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది.

 

అంచనాకు మించి అభిమానులు రావడంతో నియంత్రించడం పోలీసుల వల్ల కాలేదు. మైదానం సామర్థ్యం 35 వేల మంది మాత్రమే. కానీ, అంచనాలకు మించి వచ్చారు. ఆ సమయంలో వాన కరిసింది. దీంతో సాయంత్రం 4 గంటలకు వెనుక గేటు వద్ద తొక్కిసలాట జరిగి పలువురు మృతిచెందారు. కొన్నిగంటల తర్వాత ఆ ప్రాంతంలో చెల్లాచెదురుగా చెప్పులు, ఫోన్లు, బ్యాగులు పడి ఉన్నాయి.

ఇవి కూడా చదవండి: