AI Digital Highway: దేశంలోనే ఏఐ డిజిటల్ హైవే.. దీన్ని ప్రత్యేకతలేంటో తెలుసా..?

AI Digital Highway: జాతీయ రహదారుల రూపు మారిపోతున్నది. ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. దేశంలోనే తొలిసారిగా ఏఐ ఉపయోగించబోతున్నది. వాహనదారుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణే లక్ష్యంగా తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టం (ఏటీఎంఎస్)ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఢిల్లీ-గురుగ్రామ్‌లను కలిపే ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేపై స్మార్ట్ వ్యవస్థను ప్రారంభించింది.
రహదారి దేశంలో తొలి ఏఐ ఆధారిత డిజిటల్ హైవేగా గుర్తింపు పొందింది. అత్యాధునిక వ్యవస్థ 14 రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించగలదు. సీటు బెల్ట్ లేకపోవడం, ద్విచక్ర వాహనాలపై ముగ్గురు ప్రయాణించడం, ఎక్కువ స్పీడ్‌తో ప్రయాణించడాన్ని తక్షణమే గుర్తిస్తుంది. స్మార్ట్ కెమెరాలు వాహనాల వివరాలను వెంటనే ఎన్‌ఐసీ ఈ-చలాన్ పోర్టల్, సంబంధిత పోలీసులకు పంపిస్తుంది.
మానవ జోక్యం లేకుండా ఆటోమేటిక్‌గా చలాన్లు జారీ అవుతాయి. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) మార్గదర్శకాలకు అనుగుణంగా ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్‌ఎంసీఎల్) వ్యవస్థను అభివృద్ధి చేసింది. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే, ఎన్‌హెచ్-48పై 56.46 కిలోమీటర్ల పొడవునా సిస్టం అమలులో ఉంది.
ప్రతి కిలోమీటరుకు ఒకటి చొప్పున 110 హై-రిజల్యూషన్ PTZ కెమెరాలు అమర్చారు. కెమెరాలు 24 గంటలు రహదారి పరిస్థితులను పర్యవేక్షిస్తాయి. వ్యవస్థకు కేంద్ర కంట్రోల్ రూమ్ డిజిటల్ బ్రెయిన్‌లా పనిచేస్తుంది. ప్రమాదాలు, పొగమంచు, అడ్డంకులు, జంతువుల ప్రవేశం తదితర అంశాలను వెంటనే గుర్తించి సంబంధిత అధికారులను అప్రమత్తం చేస్తుంది. డిజిటల్ డిస్‌ప్లే బోర్డుల ద్వారా ప్రయాణికులకు అవసరమైన సమాచారం అందిస్తుంది.