Published On:

DK Shivakumar: మరో మూడు నెలల్లో కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌.. సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

DK Shivakumar: మరో మూడు నెలల్లో కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌.. సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

Karnataka: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ముఖ్యమంత్రి పదవి స్వీకరిస్తారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్ఎ.ఇక్బాల్ హుస్సేన్ ఆదివారం జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. మళ్లీ అదే విషయాన్ని తెరపైకి తీసుకువచ్చారు. మరో రెండు, మూడు నెలల్లో డీకే కర్ణాటక సీఎంగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి ఎవరు కృషిచేశారో అందరికీ తెలుసన్నారు. ప్రస్తుతం అధిష్ఠానం శివకుమార్‌ గురించే మాట్లాడుతోందని చెప్పారు. ఈ ఏడాది చివరిలో కర్ణాటక ప్రభుత్వంలో నాయకత్వ మార్పు గురించి ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో డీకేకు సన్నిహితుడు ఇక్బాల్ హుస్సేన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

 

సెప్టెంబర్ తర్వాత కర్ణాటక రాజకీయాల్లో విప్లవాత్మక పరిణామాలు నెలకొంటాయని మంత్రి కేఎన్.రాజన్న ఇటీవల పేర్కొన్నారు. దీంతో త్వరలో నాయకత్వ మార్పు తథ్యమని అధికార పార్టీలో విస్తృత చర్చ నడుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. నాయకత్వ మార్పు అధిష్ఠానం పరిధిలో ఉందని తెలిపారు. దీనిపై బహిరంగంగా మాట్లాడలేనని పేర్కొన్నారు.

 

2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీఎం పదవిపై రాష్ట్ర కాంగ్రెస్‌లో తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ ఇద్దరు రెండున్నరేళ్లపాటు పదవిలో కొనసాగేలా అంగీకారానికి వచ్చారనే వార్తలు వచ్చాయి. డీకే కూడా ఎప్పటికైనా సీఎం పదవిని స్వీకరిస్తాననే బహిరంగంగానే చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఎక్కువ స్థానాలు గెలిస్తే తన పదవికి బలం చేకూరుతుందని చెప్పారు. మళ్లీ విషయం తెరపైకి రావడంతో కాంగ్రెస్‌ పార్టీ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.

ఇవి కూడా చదవండి: