Published On:

Weekly Dress Code: ప్రభుత్వ టీచర్లకు వీక్లీ డ్రెస్‌కోడ్‌.. చండీగఢ్‌ అధికారుల ఆదేశం

Weekly Dress Code: ప్రభుత్వ టీచర్లకు వీక్లీ డ్రెస్‌కోడ్‌.. చండీగఢ్‌ అధికారుల ఆదేశం

Chandigarh Government: చండీగఢ్‌ ప్రభుత్వ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకు డ్రెస్‌ కోడ్‌ వేసుకోవాలని నిర్ణయించారు. వచ్చే సోమవారం నుంచి చండీగఢ్‌ ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు ప్రతి వారం అధికారికంగా డ్రెస్‌కోడ్‌ను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. తాజాగా విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ తరహా చొరవ దేశంలో ఇదే మొదటి సారి అని, బోధనా సిబ్బందిలో వృత్తి నైపుణ్యం, విజువల్‌ ఐడింటిటీ, ఏకరూపకతను ప్రోత్సహించడమే లక్ష్యంగా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

 

ప్రతి సోమవారం టీచర్లు ధరించాల్సిన ప్రత్యేక దుస్తులకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేశారు. పురుషులు నీలం రంగు ఫార్మల్‌ చొక్కా, బూడిద రంగు ప్యాంటు ధరించాలని పేర్కొన్నారు. మహిళా ఉపాధ్యాయులు గోధుమ వర్ణం చీరలు లేదా మెరూన్‌ బోర్డర్‌ కలిగిన సల్వార్‌-కమీజ్‌ ధరించాలని తెలిపారు. ప్రిన్సిపాళ్లు పురుషులైతే బూడిదరంగు ప్యాంటు, తెల్ల రంగు చొక్కా ధరించాలని తెలిపారు. మహిళా ప్రిన్సిపాళ్లు లేత గోధుమ రంగు చీరలు లేదా బంగారు అంచులు ఉన్న సల్వార్-కమీజ్ ధరించాలని సూచించారు.

 

ఆయా స్కూళ్లల్లో సమష్టి వృత్తిపరమైన గుర్తింపు, క్రమశిక్షణతో కూడిన వాతావరణాన్ని పెంపొందించడమే లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. వచ్చే సోమవారం నుంచి ఎలాంటి మినహాయింపు లేకుండా సిబ్బంది వీక్లీ డ్రెస్‌ కోడ్‌ పాటించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇవి కూడా చదవండి: