Published On:

Flight crash: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కుట్ర కోణంపై దర్యాప్తు: కేంద్రం

Flight crash: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కుట్ర కోణంపై దర్యాప్తు: కేంద్రం

Air India flight: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కుట్రకోణంపై దర్యాప్తు చేయిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఇటీవల గుజరాత్‌‌లోని అహ్మదాబాద్‌‌లో AI-171 విమానం కూలిపోయి 279 మంది మృతిచెందగా, ఈ ఘటనలో కుట్ర కోణంపై తాము దృష్టి సారించామని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్‌ మోహోల్‌ చెప్పారు.

 

విమాన ప్రమాదం కేసును ఎయిర్‌ క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో కేసు దర్యాప్తు చేస్తోందని తెలిపారు. పుణేలో జరుగుతున్న ఓ కాన్‌క్లేవ్‌లో మంత్రి మాట్లాడారు. ప్రమాదం స్థలం నుంచి రికవరీ చేసిన బ్లాక్‌బాక్స్‌ ఏఏఐబీ ఆధీనంలో ఉందని, విశ్లేషణ కోసం విదేశాలకు పంపబోమని స్పష్టంచేశారు.

 

విమాన ప్రమాదంపై ఏఏఐబీ పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభించిందని ఆయన తెలిపారు. అన్ని కోణాలను పరిశీలిస్తున్నారని చెప్పారు. కుట్ర ఏదైనా ఉందా..? అనే అంశంపై దృష్టిపెట్టారని తెలిపారు. సీసీటీవీ దృశ్యాలను విశ్లేషిస్తున్నారని తెలిపారు. రెండు ఇంజిన్లు ఒకేసారి విఫలం కావడం గతంలో ఎన్నడూ జరగలేదని స్పష్టం చేశారు. ఇది అరుదైన కేసు అన్నారు. దర్యాప్తు నివేదిక వస్తే గానీ రెండు ఇంజిన్లు విఫలం అయ్యాయా..? లేక ఇంధన సరఫరాలో సమస్య తలెత్తిందా అనేది తేలుతుందన్నారు. బ్లాక్‌ బాక్స్‌లోని కాక్‌పీట్‌ వాయిస్‌ రికార్డర్‌లో పైలట్ల సంభాషణ నిక్షిప్తమై ఉందన్నారు. నివేదిక మూడు నెలల్లో వస్తుందని తెలిపారు. ఇప్పుడే దానిపై మాట్లాడటం తొందరపాటు అవుతుందని మురళీధర్‌ చెప్పారు.

 

విశ్లేషణ కోసం బ్లాక్‌బాక్స్‌ను విదేశాలకు పంపనున్నారనే ప్రచారాన్ని మంత్రి కొట్టిపారేశారు. అది ఎక్కడికి పోదని తేల్చిచెప్పారు. దర్యాప్తు సంస్థల కస్టడీలోనే ఉందన్నారు. దేశంలో వినియోగిస్తున్న 33 డ్రీమ్‌లైనర్‌ విమానాలను డీజీసీఏ ఆదేశాల మేరకు క్షుణ్ణంగా తనిఖీలు చేశారని తెలిపారు. ప్రజలు ఇప్పుడు భయపడటం లేదని తెలిపారు. వారు సౌకర్యవంతంగా ప్రయాణిస్తున్నారన్నారు.

ఇవి కూడా చదవండి: