DK Shivakumar: నా తరఫున ఎవరూ మాట్లాడొద్దు : కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్

Karnataka: కర్ణాటకలో సీఎం మార్పు అంశం చర్చనీయాంశంగా మారింది. రెండు, మూడు నెలల్లో డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని ఆ పార్టీకి చెందిన నేతలు వ్యాఖ్యానించారు. మద్దతుగా 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఇప్పటికే ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే డీకే ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు.
నా తరఫున ఎమ్మెల్యేలు మాట్లాడాలని కోరుకోవడం లేదన్నారు. 2028లో జరిగే ఎన్నికలపై నేతల దృష్టి ఉండాలని సూచించారు. తాను మొదట పార్టీ కార్యకర్తను అన్నారు. అన్నింటికంటే పార్టీనే ముఖ్యమని స్పష్టం చేశారు. అధిష్ఠానం ఆదేశాలు, పార్టీ మేనిఫెస్టో ఆధారంగా పార్టీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పనిచేయాలని కోరారు. పార్టీలో ఎలాంటి వర్గాలు లేవన్నారు. మల్లికార్జున ఖర్గే నేతృత్వంలోని ఒక కాంగ్రెస్ మాత్రమే ఉందన్నారు. ఆయన వ్యాఖ్యలను బట్టి ముఖ్యమంత్రి కలను మరొకసారి వెనక్కి తీసుకున్నారని తెలుస్తోందన్నారు.
రాష్ట్రంలో నాయకత్వ మార్పులేదని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రణదీప్ సూర్జేవాలా వెల్లడించారు. ఊహాగానాల వెనక బీజేపీ కుట్ర ఉందని విమర్శించారు. తమ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు నిలిచిపోవాలని బీజేపీ కోరుకుంటోందన్నారు. కర్ణాటక కాంగ్రెస్‌లో అసమ్మతి స్వరాలు వినిపిస్తోన్న వేళ అధిష్ఠానం ఆయన్ను రాష్ట్రానికి పంపింది. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడుతూ నాయకత్వ మార్పు ఉండదని స్పష్టం చేశారు.
సిద్ధరామయ్యకు లాటరీ తగిలింది..
కర్ణాటక కాంగ్రెస్‌లో అంతా ఓకేనని సూర్జేవాలా, డీకే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. అందులో సీనియర్ నేత బీఆర్ పాటిల్ ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడటం కనిపించింది. సిద్ధరామయ్యకు లాటరీ తగిలిందని మాట్లాడారు. ఆయన్ను సోనియాగాంధీకి పరిచయం చేసింది తానేనని, ఆయన అదృష్టం బాగుండి ముఖ్యమంత్రి అయ్యారన్నారు. తనకు ఏ గాడ్ ఫాదర్ లేరన్నారు. తాను సూర్జేవాలను కలిశానని, చెప్పాల్సిందంతా చెప్పానన్నారు. ఏం జరుగుతుందో చూద్దామని ఫోన్ మాట్లాడారు. ఇప్పుడు ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.